Begin typing your search above and press return to search.

అంపై'రాంగ్'.. మైదానంలో ఉండాల్సిన వాడు.. దుస్తుల దుకాణంలో

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:30 PM GMT
అంపైరాంగ్.. మైదానంలో ఉండాల్సిన వాడు.. దుస్తుల దుకాణంలో
X
ఆటలో అయినా.. జీవితంలో అయినా కొన్నిసార్లు ఒకే ఒక తప్పు అంతా తలకిందులు చేస్తుంది. అందలం ఎక్కాల్సినవారిని పాతాళానికి తొక్కేస్తుంది. శిఖరాలు అధిరోహించాల్సిన వారిని వీధిన పడేస్తుంది. అంతా అల్లకల్లోలం చేస్తుంది. చాలామందికి ఇలాంటివి అనుభవంలోకి వస్తే గానీ తెలియవు. అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నవాడే అసద్ రవూఫ్. పాకిస్థానీ అంపైర్ అయిన రవూఫ్.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు. గొప్ప జీవితాన్ని చూశాడు. కానీ, ప్రస్తుతం దుస్తుల దుకాణ నడుపుతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.

ఏం జరిగింది? ఎందుకిలా?ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంత విజయవంతమైందో.. దానివెనుక అంతే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. అలాంటివాటిలో అతి పెద్దది 2013 నాటి మ్యాచ్ ఫిక్సింగ్. నాడు ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగులోకి రావడం.. అందులో కొందరు భారత క్రికెటర్ల ప్రమేయం కూడా ఉండడం కుదిపేసింది. దీనినే స్పాట్ ఫిక్సింగ్ గా కూడా నాడు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు విచారణ జరిపారు. అందులో పేసర్ శ్రీశాంత్ తో పాటు, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. శ్రీశాంత్.. విజేతగా నిలిచిన ప్రపంచకప్ జట్టు సభ్యడు కావడం విశేషం. అయినా సరే బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీరంతా నాడు రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఫిక్సింగ్ కేసులోనే పాకిస్థాన్ కు చెందిన అసద్ రవూఫ్ పేరు కూడా బయటకు వచ్చింది. ముంబై పోలీసులు అతడి పాత్రపై విచారణ చేపట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. రవూఫ్ ను అంపైరింగ్ ప్యానెల్ నుంచి తొలగించింది. అప్పటికి అతడు చాంపియన్స్ ట్రోఫీలో అంపైరింగ్ చేస్తున్నాడు.

సాదాసీదా కాదు.. ఎలైట్ అంపైర్ అసద్ రవూఫ్ సాదాసీదా అంపైర్ కాదు. ఎలైట్ అంపైర్. అంటే టెస్టులు సహా అంపైరింగ్ చేసేవారన్నమాట. అలాంటి స్థాయి నుంచి అసద్ రవూఫ్ ఇప్పుడు లాహోర్‌లోని లాండా బజార్‌లో ఓ చిన్న దుస్తుల దుకాణం నడిపే స్థాయికి పడిపోయాడు. రవూఫ్ 2000వ సంవత్సరం నుంచి 2013మధ్య మొత్తం 170అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇందులో 49టెస్టులు, 98 వన్డేలు, 23 టీ20లు ఉన్నాయి. అయితే ఫిక్సింగ్ వివాదం తర్వాత అతడు 2013 నుంచి మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయలేదు.

ప్రస్తుతం అతడి వయసు 66 ఏళ్లు. అంటే.. ఫిక్సింగ్ కుంభకోణంలో పేరు బయటకు వచ్చేనాటికి రవూఫ్ వయసు 56 ఏళ్లే. బహుశా అంతా బాగుంటే ఇప్పటికీ అతడు అంపైరింగ్ కొనసాగించేవాడు. ఎన్నో రికార్డులు తన వశమయ్యేవి. కానీ, 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయాడు. బుకీల నుంచి కాస్ట్‌లీ బహుమతులను స్వీకరించి అతను అవినీతికి పాల్పడినట్లు బీసీసీఐ డిసిప్లనరీ కమిటీ నిర్ధారించింది.

ఇక 2016లో రౌఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇక ఈ విషయమై పాక్ టీవీ.టీవీతో అతను మాట్లాడుతూ.. 'నాకు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నేను ఐపీఎల్‌లో నా అత్యుత్తమ టైంను వెచ్చించాను. బీసీసీఐ నుంచి ఆరోపణలొచ్చాయి. వారంతట వారే నాపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు' అని తెలిపాడు. అయితే, ఒకసారి అంపైరింగ్ వదిలిపెట్టాక మళ్లీ దాని జోలీకి వెళ్లకూడదని నిశ్చితాభిప్రాయంలో రవూఫ్ ఉన్నాడు. తాను ఎంపైరింగ్ పూర్తిగా వదిలిపెట్టానని పేర్కొన్నాడు. అలాగే దుస్తుల దుకాణంతో ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నాడు.

లైంగిక ఆరోపణలూ ఉన్నాయి రవూఫ్ కెరీర్ కు సంబంధించే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ వివాదాలు ఎదుర్కొన్నాడు. ముంబైకి చెందిన ఓ మోడల్ అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం 2012లో సంచలనం రేపింది. వాస్తవానికి మ్యాచ్ ఫిక్సింగ్ కు ముందే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటి కారణంగా రవూఫ్ చాలా సతమతమయ్యాడు. తనను పెళ్లి చేసుకుంటానని రవూఫ్ వాగ్దానం చేయడంతో లైంగిక సంబంధం కొనసాగించానని, కానీ తర్వాత మొహం చాటేశాడంటూ ఆ మోడల్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను పదేళ్ల తర్వాత కూడా అతడు ఖండిస్తున్నాడు.

"అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు చెబుతున్నా.. అవన్నీ అవాస్తవాలు" అంటూ పునరుద్ఘాటిస్తున్నాడు. "లైంగిక ఆరోపణలు వచ్చాక కూడా నేను అంపైరింగ్‌ను కొనసాగించాను. తర్వాతి ఐపీఎల్ సీజన్లో అంపైరింగ్ చేశాను"అని పేర్కొంటున్నాడు. కానీ, ఆ యువతికి చేసిన అన్యాయం వెంటాడిందో ఏమో..? రవూఫ్ మరుసటి సంవత్సరంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకున్నాడు. అంపైర్ గా శిఖరాలు చేరిన అతడు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసిన అతడు.. ప్రస్తుతం అతి సాధారణ వ్యాపారిగా జీవిస్తున్నాడు.