Begin typing your search above and press return to search.

నిమ్మలా... బాబును బుక్ చేశావు కదయ్యా!

By:  Tupaki Desk   |   11 July 2019 2:10 PM GMT
నిమ్మలా... బాబును బుక్ చేశావు కదయ్యా!
X
రైతులకు వడ్డీ లేని రుణాలంటూ వైసీపీ అధినేత. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై జరిగిన చర్చలో టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అడ్డంగా బుక్కైపోయారు. బాబు అలా బుక్ కావడానికి వేరెవరో కారణం కాదు... టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లోని ఓ ఎమ్మెల్యేనే కావడం ఇక్కడ గమనార్హం. బాబును అంతగా బుక్ చేసిన ఆ ఎమ్మెల్యే వేరెవరో కాదు... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు. చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పావలా వడ్డీ రుణాలను తమ ప్రభుత్వం... వడ్డీ లేని రుణాలుగా మార్చేసి అన్నదాతలకు మరింతగా దన్నుగా నిలిచేందుకు సిద్ధపడిందని గురువారం నాటి అసెంబ్లీలో జగన్ ఘనంగానే ప్రకటించారు.

ఈ విషయంపై జరిగిన చర్చ సందర్భంగా నిమ్మల చేసిన ఓ వేక్ కామెంట్ ఆధారంగా చంద్రబాబుపై జగన్ ఎక్కి దిగినంత పనిచేశారని చెప్పాలి. బాబు హయాంలో రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందించారు. అది కూడా బాబు హయాంలో మొదలైన పథకమేమీ కాదు. అయితే వడ్డీ లేని రుణాలను జగన్ సర్కారేమీ కొత్తగా ఇవ్వలేదని, తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమలు చేశారని రామానాయుడు చెప్పారు. అయితే రామానాయుడు వాదనలోని డొల్లతనాన్ని వెంటనే పట్టేసిన జగన్.. బాబుతో పాటు టీడీపీ శిబిరాన్ని ఓ దులుపు దులిపేశారని చెప్పాలి. బాబు హయాంలో ఒక్కరంటే ఒక్క రైతు కైనా వడ్డీ లేకుండా రుణాలిచ్చినట్టు నిరూపించాలని, లేని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ ఏకంగా ఓ పెను సవాల్ నే విసిరారు. ఈ సవాల్ తో బాబు నిజంగానే ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెప్పాలి. చంద్రబాబు హయాంలో అసలు వడ్డీ లేని రుణాలన్న మాటే లేదు కదా. అలాంటిది జగన్ సర్కారు కంటే తామే మెరుగ్గా పనిచేశామన్న కోణంలో తనదైన వాదన వినిపించేందుకు సిద్ధపడిన రామానాయుడు... బాబును నిజంగానే బుక్ చేసి పారేశారు.

ఇక దొరికిందే అవకాశమన్నట్లుగా జగన్ కూడా చంద్రబాబు శిబిరంపై ముప్పేట దాడికి దిగారు. ఇప్పటికిప్పుడే లెక్కలు తెప్పిస్తాను... చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు చంద్రబాబు నానా తంటాలు పడాల్సి వచ్చింది. సీనియర్ ని అయిన తనను అవమానించేలా మాట్లాటడం జగన్ కు తగదని, ఎవరి ప్రభుత్వంలో వారి ప్రాధమ్యాలకు అనుగుణంగానే పథకాలు అమలు అవుతాయని - వాటిని పట్టుకుని రాజీనామాలు అంటూ సవాళ్లు విసరడమేమిటని చంద్రబాబు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లక తప్పలేదు. మొత్తంగా సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు అసెంబ్లీలో బాగానే ఇబ్బందిపడక తప్పలేదు.