Begin typing your search above and press return to search.

వామ్మో?; 32,500 కోట్లు కాస్తా 50వేల కోట్లు

By:  Tupaki Desk   |   20 July 2016 4:35 AM GMT
వామ్మో?; 32,500 కోట్లు కాస్తా 50వేల కోట్లు
X
ఏం ప్రాజెక్టులో.. ఏం కతో అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రాజెక్టులు ఏవైనా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలే కానీ.. అదో శాపంగా మారకూడదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన పాలమూరు ఎత్తిపోతుల పథకం అంచనా లెక్క వింటుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే పది లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు ఇవ్వొచ్చని.. తాగునీటి అవసరాల్ని కూడా తీర్చొచ్చొని ముద్దుముద్దు మాటలు చెబుతున్నారు. ఈ మాటలన్నీ వినేసి.. సంతోషిస్తే పప్పులో కాలేసినట్లే.

ఎందుకంటే.. ఈ పథకం పూర్తి చేయటానికి కావాల్సిన ఖర్చు అక్షరాల రూ.50వేల కోట్లు. ఈ ఖర్చు లెక్క ఇప్పటికి మాత్రమే. ఏడాది తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. గత ఏడాది ఈ పథకాన్ని రూ.35,200 కోట్లతో పూర్తి చేయొచ్చన్న అంచనాలు అధికారులు వినిపించారు. తాజాగా మారిన పరిస్థితులు.. ఖర్చులకు తగ్గట్లుగా అంచనా వేస్తే.. అది కాస్తా రూ.47,632 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు.

ఈ ఖర్చుతో అయినా ఆగుతుందా? అంటే.. అధికారులు నో అనేస్తున్నారు. ఇప్పుడున్న అంచనా ప్రకారం ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి రూ.50వేల కోట్ల ఖర్చుకు టచ్ కావటం ఖాయమని చెబుతున్నారు. అంచనాల్లోనే అదిరిపోయే అంకెలు కనిపిస్తున్న వేళ.. మొత్తంగా పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి ఎంత మొత్తం అవుతుందన్నది పక్కాగా చెప్పాలంటే.. చటుక్కున చెప్పలేని పరిస్థితి.

అంచనాల దగ్గరే.. ఆర్నెల్ల వ్యవధిలోనే ఇంతేసి మొత్తంలో ఖర్చు లెక్క మారిపోతే.. ఈ భారీ ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి ఎంత ఖర్చు లెక్క వస్తుందన్నది అంతుబట్టనిదిగా మారింది. ఇన్నేసి వేల కోట్లు ఖర్చు చేస్తే కానీ.. 10లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేమా? అంతకు మించి తగ్గించేందుకు సాధ్యం కాదా? అన్న ప్రశ్నలకు తెర మీదకు వస్తున్న పరిస్థితి. దీనికి తగ్గట్లే కొందరు ఇరిగేషన్ నిఫుణులు.. మేధావులు ఈ ప్రాజెక్టుకు ఇంత ఖర్చు పెట్టటం వృధా అని చెబుతున్నా ప్రభుత్వం మాత్రం మొండితనంతో ముందుకెళ్లటం కనిపిస్తున్నదే. ఇన్నేసి వేల కోట్ల రూపాయిలు పాలకులు ఆకాశంలో నుంచి పుట్టించలేరని.. ఇదంతా ప్రజల వీపు మీదే పడుతుందన్న విషయాన్ని యాదిలోకి తెచ్చుకొని కాస్త ముందు వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇగోలతో నిండిన అధికార భారతం.. మేధావులు.. నిపుణులు చెప్పే మాటల్ని వినే పరిస్థితుల్లో ఉందా? అన్నదే ప్రశ్న.