Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్యం: నిరాహార దీక్ష‌లో సీఎం-డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   3 April 2018 10:05 AM GMT
ఆశ్చ‌ర్యం: నిరాహార దీక్ష‌లో సీఎం-డిప్యూటీ సీఎం
X
పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు ప‌రిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో కావేరీ మేనేజ్‌ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు నిరాహార దీక్షలు చేస్తున్నాయి. అయితే చెన్నైలోని చెపాక్ సమీపంలో జరుగుతున్న నిరాహార దీక్షలో సీఎం పళనిస్వామి - డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి అక్కడ దీక్ష చేస్తున్న వాళ్ల జాబితాలో ఈ ఇద్దరి పేర్లు లేవు. కనీసం పోలీసులు - పార్టీ నేతలకు కూడా తెలియకుండా వాళ్లిద్దరూ హఠాత్తుగా వచ్చి దీక్షలో కూర్చుండ‌టం గ‌మ‌నార్హం.

ప్రతిపక్ష డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు నిరాహారదీక్షకు రావడం చర్చనీయాంశమైంది. వాళ్లు వచ్చి దీక్షలో కూర్చునేంత వరకు కూడా ఇక్కడికి వస్తారని తమకు తెలియదని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. సీఎం - డీప్యూటీ సీఎం రావడంతో అధికారులు - పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి జయకుమార్ - పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ - ఇతర నేతలు - పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి వచ్చారు.

మ‌రోవైపు కావేరి వ్యవహారంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందల మందిని పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు. కావేరి వ్యవహారంలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నై నుంగంబాక్కంలోని వళ్లువర్‌ కోట్టంలో డీఎంకే దాని మిత్రపక్షాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తమ ఆందోళనలు కొనసాగుతాయని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. రాస్తారోకోలు - రైల్‌ రోకోలు చేశారు.