Begin typing your search above and press return to search.

నిన్న కాళ్లు మొక్కిన వాళ్లే, కూలదోశారు!

By:  Tupaki Desk   |   13 Sep 2017 5:06 AM GMT
నిన్న కాళ్లు మొక్కిన వాళ్లే, కూలదోశారు!
X
రాజకీయం అంటే దాని పోకడలు అచ్చంగా ఎలా ఉంటాయో.. తమిళనాడులో కనిపిస్తోంది. రాజకీయ కుట్రలు కూహకాలు చేసే వారి గురించి సాధారణంగా.. కాళ్లు మొక్కడం అంటే..కాళ్లు పట్టుకుని కూలదోసేస్తాడని సరదాగా వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. కానీ తమిళనాడులో.. అచ్చంగా అవే పరిణామాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న తనను ముఖ్యమంత్రిని చేసినందుకు చిన్నమ్మ శశికళ కాళ్లు మొక్కిన ముఖ్యమత్రి పళనిస్వామి నేతృత్వంలోనే.. శశికళను, ఆమె బంధువు టీటీవీ దినకరన్ ను కూడా పార్టీనుంచి బహిష్కరించారు. చిన్నమ్మ శశికళ చేపట్టిన సమస్త నియామకాలను రద్దుచేసేశారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే పరిస్థితులు ఎంతగా మారిపోయాయో గమనిస్తున్నప్పుడు రాజకీయం అంటే అచ్చంగా ఇలాగే ఉంటుంది అని మనకు అర్థమౌతుంది. కాకపోతే.. ఇక్కడ కూలదోసిన వాళ్లు కుట్రలు చేసిన వాళ్లు కాదు.. తమ కుర్చీ కాపాడుకోవడానికి బహిరంగంగానే గోతులు తవ్వుతున్న వారిని వెలివేశారంతే!

తమిళ రాజకీయాలు చాలా మలుపులు తిరగబోతున్నాయి. ఎందుకంటే.. అన్నాడీఎంకే ప్రభుత్వం మైనారిటీలో ఉన్నదని, ఎమ్మెల్యేలు అంతా తన వెంటే ఉన్నారని వాదిస్తున్న టీటీవీ దినకరన్ వర్గం.. ప్రభుత్వాన్ని కూలదోయడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. చివరికి వారు పరిమిత ఎమ్మెల్యేలతోనే రాష్ట్రపతిని కూడా కలిశారు. దినకరన్ వర్గం దూరమైతే.. పార్టీ మైనారిటీలో పడడం నిజమే గానీ.. పళనిస్వామి ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేసి.. దినకరన్ ను - శశికళను పార్టీనుంచి బహిష్కరించేశారు. దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తిరిగి ప్రభుత్వ వర్గంలోకి వచ్చి - పళని- పన్నీర్ లకు అనుకూలంగా ఉండకపోతే గనుక.. వారి మీద కూడా వేటు పడే ప్రమాదం ఉంది.

నిజానికి దినకరన్ వెంట నిలుస్తున్న ఎమ్మెల్యేల మీద వేటు వేయడం పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు చాలా అవసరం. ఎందుకంటే.. వారి మీద అనర్హత వేటు వేస్తే.. ఉన్న సంఖ్యాబలంతోనే విశ్వాసపరీక్షను కూడా నెగ్గగల స్థితి వస్తుంది. అందుకోసం వారు ఎదురుచూస్తున్నారు. లేదా, దినకరన్ వర్గం నుంచి కొందరైనా తమ వైపు వచ్చేస్తారనే ఆశతో ఉన్నారు. అదే సమయంలో.. అధికార కూటమిలో తన వర్గానికి చెందిన వారు ఇంకా 40 మందికి పైగా ఉన్నారని చెబుతూ వచ్చిన దినకరన్ మాటలు కల్లబొల్లి కబుర్లే అని తేలిపోయింది. జనరల్ కౌన్సిల్ సమావేశానికి 90 శాతం మందికిపైగా వచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో.. ఇక శశికళ రాజకీయ పరోక్ష పెత్తనానికి తెరపడినట్లే అని పలువురు భావిస్తున్నారు.