Begin typing your search above and press return to search.

అంద‌రూ క‌లిసి చిన్న‌మ్మ‌ను గెంటేశారు

By:  Tupaki Desk   |   12 Sep 2017 7:57 AM GMT
అంద‌రూ క‌లిసి చిన్న‌మ్మ‌ను గెంటేశారు
X
ఎట్ట‌కేల‌కు అనుకున్న‌దే జ‌రిగింది. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అధికార అన్నాడీఎంకే పార్టీలో చోటు చేసుకుంటున్న అంత‌ర్గత కుమ్ములాట‌ల్లో చివ‌ర‌కు చిన్న‌మ్మ‌కు షాక్ త‌ప్ప‌లేదు. అమ్మ‌కు అత్యంత విధేయుడైన ప‌న్నీర్ సెల్వం.. చిన్న‌మ్మ‌కు విశ్వాస‌పాత్రుడైన ప‌ళ‌నిస్వాములు ఇద్ద‌రు క‌లిసి చిన్న‌మ్మ అలియాస్ శ‌శిక‌ళ‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

పార్టీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ ఈ రోజు స‌మావేశ‌మై.. చిన్న‌మ్మ‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేలా నిర్ణ‌యం తీసుకున్నారు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అమ్మ స్థానాన్ని చేజిక్కించుకున్న శ‌శిక‌ళ‌ను అన్నాడీఎంకే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పీఠం నుంచి దించేశారు. అంతేకాదు.. ఆమె హ‌యాంలో తీసుకున్న నిర్ణ‌యాల‌న్నింటిని స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ర‌ద్దు చేసింది. చిన్న‌మ్మ‌తో పాటు.. తాను జైలుకు వెళ్లే స‌మ‌యంలో పార్టీ డిఫ్యూటీ చీఫ్ గా నియ‌మించిన దిన‌క‌ర‌న్ ను సైతం పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజా ప‌రిణామాల‌తో శ‌శిక‌ళ వ‌ర్గాన్ని అంద‌రూ పిలుచుకునే మ‌న్నార్ గుడి మాఫియాకు ప‌ళ‌ని.. ప‌న్నీర్ ద్వ‌యం పూర్తిస్థాయిలో చెక్ పెట్టిన‌ట్లైంద‌ని చెప్పాలి. వీరిద్ద‌రి నేతృత్వంలో స‌మావేశ‌మైన అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ కౌన్సిల్ మంగ‌ళ‌వారం ఆరు కీల‌క నిర్ణ‌యాల్నిప్ర‌వేశ పెట్టి తీర్మానించ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా అన్నాడీఎంకేలో చిన్న‌మ్మ శ‌కం ముగిసిన‌ట్లేన‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.