Begin typing your search above and press return to search.

శశికళ పని అయిపోయినట్లేనా..?

By:  Tupaki Desk   |   15 March 2017 5:11 AM GMT
శశికళ పని అయిపోయినట్లేనా..?
X
తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే శశికళ మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. శశికళను పూర్తిగా పక్కనపెట్టడానికి అందరూ సిద్ధమైపోయారని తెలుస్తోంది. శశికళ వర్గానికే చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి శరవేగంగా తన సొంత వర్గాన్ని తయారుచేసుకుంటుండడంతో పాటు శశికళ పేరు కానీ, ఆమె ఫొటో కానీ ఎక్కడా లేకుండా చేయడం చూస్తుంటే శశికళ శకం ముగిసిపోయినట్లేనని తమిళులు అంటున్నారు. అన్నా డీఎంకే కార్యక్రమాల్లో శశికళ ఫొటో కానీ, పేరు కానీ కనిపిస్తే అది నెగటివ్ ముద్ర వేస్తుందని.. అమ్మ మరణానికి శశికళ కారణమని భావిస్తున్న ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకుంటారని.. పార్టీకి అది నష్టం కలిగిస్తుందన్న కారణంతో ఆమె ఫొటో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే పైకి చెబుతున్న కారణం ఇదయినా అసలు కారణం పళనిస్వామి పక్కా స్కెచ్ అని తెలుస్తోంది.

రీసెంటుగా జయలలిత జయంతి సందర్భంగా కోవిలంబాక్కంలో సంక్షేమ పథక సహాయాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం పల్లావరం-తురైపాక్కం రోడ్డులో శశికళ వర్గీయులు పెద్ద ఎత్తున భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఎక్కడా శశికళ ఫొటో కానీ, పేరు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. పొరపాటున కూడా ఆమె ఫొటో ప్రింట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమార్జన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ ఫొటోను ముద్రిస్తే పార్టీ అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించే ఆమె ఫొటో లేకుండానే బ్యానర్లను ముంద్రించినట్టు చెబుతున్నారు. అయితే.. బీజేపీ బాగా బలంగా ఉండడంతో శశికళ ఇప్పుడిప్పుడే బయటకు రావడం అసాధ్యం కాబట్టి.. ఆలోగా తాను బలపడాలని పళనిస్వామి మార్గమేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఆయన శశికళ నుంచి వచ్చే సూచనలు స్వీకరించడం మానేశారని తెలుస్తోంది. ఆర్కేనగర్ బై ఎలక్షన్ తరువాత పూర్తిగా తన మార్కు చూపిస్తానని పళని స్వామి తన సన్నిహితులు వద్ద అన్నట్లు తమిళ మీడియాలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ శపథాలు, రాజకీయ కలలు అన్నీ సమాధి కావాల్సిందేనని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/