Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ మాట‌ను ప‌క్క‌న‌బెట్టిన ఈపీఎస్‌!

By:  Tupaki Desk   |   25 Feb 2017 6:57 AM GMT
చిన్న‌మ్మ మాట‌ను ప‌క్క‌న‌బెట్టిన ఈపీఎస్‌!
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అన్నాడీఎంకే దివంగ‌త అధినేత్రి జ‌య‌లలిత‌కు న‌మ్మిన బంటుగా కొన‌సాగిన ప‌న్నీర్ సెల్వం... అమ్మ‌కు క‌ష్ట‌మొచ్చిన‌ప్పుడ‌ల్లా సీఎం పీఠం ఎక్కారు. అమ్మ ఆ క‌ష్టాల్లో నుంచి గ‌ట్టెక్క‌గానే ఆ పీఠాన్ని ఆమెకు అప్ప‌గించారు. ఇదీ నిన్న‌టిదాకా త‌మిళ‌నాట మ‌న‌కు క‌నిపించిన చిత్రం. అమ్మ మ‌ర‌ణించాక‌... అమ్మ పీఠాన్ని అధిష్టించాల‌ని య‌త్నించి భంగ‌ప‌డిన చిన్న‌మ్మ శ‌శిక‌ళకు మాత్రం ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌డం లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష ప‌డ్డ శ‌శిక‌ళ‌... బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నారు. తాను సీఎం పీఠం ఎక్కాల‌ని య‌త్నించిన శ‌శిక‌ళ‌... జైలు శిక్ష ప‌డ‌టంతో త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడిగా పేరున్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామిని సీఎం పీఠం ఎక్కించారు.

అయితే అమ్మ‌కు ప‌న్నీర్ సెల్వం న‌మ్మిన‌బంటుగా ఉన్న మాదిరిగా చిన్న‌మ్మ‌కు ప‌ళ‌నిస్వామి భ‌క్తుడిగా ఉండేందుకు స‌సేమిరా అంటున్నారు. ఇందుకు ఆయ‌న చూపుతున్న కార‌ణాలు కూడా ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. అస‌లు రాజ‌కీయంగా ఏమాత్రం అనుభ‌వం లేని శ‌శిక‌ళ మాట తానెందుకు వినాల‌న్న ధోర‌ణితో ముందుకు వెళుతున్న ప‌ళ‌నిస్వామి... త్వ‌ర‌లోనే చిన్న‌మ్మ‌పై తిరుగుబాటు చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు ప‌రిశీల‌కులు. ఇందుకు వారు ఉద‌హ‌రిస్తున్న రెండు, మూడు ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తే... చిన్న‌మ్మ శ‌కం త్వ‌ర‌లోనే ముగిసే అవకాశాలు స్ప‌స్టంగానే క‌నిపిస్తున్నాయి.

ఇక అసలు విష‌యంలోకి వెళితే... జ‌య జైల్లో ఉండ‌గా... అక్క‌డి నుంచి ఆమె పంపిన ఆదేశాల మేర‌కే త‌మిళ‌నాడులో పాల‌న జ‌రిగేది. ప‌న్నీర్ సెల్వం అమ్మ‌కు చెప్ప‌కుండా చిన్న సంత‌కం కూడా చేసేవారు కాదు. కానీ ప‌ళ‌నిస్వామి అలా కాదు. జైల్లో ఉన్న చిన్న‌మ్మ నుంచి వ‌చ్చిన కీల‌క ఆదేశాల‌ను అమ‌లు చేసేందుకు ఆయ‌న సిద్ధంగా లేరు. ఇటీవల అన్నాడీఎంకే ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న టీవీవీ దిన‌క‌ర‌న్‌... బెంగ‌ళూరు వెళ్లి జైల్లో ఉన్న శ‌శిక‌ళ‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీల‌కు సంబంధించి శ‌శిక‌ళ ఓ జాబితాను దిన‌క‌ర‌న్ చేతిలో పెట్టారు. దానిని భ‌ద్రంగా జేబులో పెట్టుకుని తిరుగు ప‌య‌న‌మైన దిన‌క‌ర‌న్ దానిని ప‌ళ‌నిస్వామికి ఇచ్చి చిన్న‌మ్మ ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని ఆర్డ‌రేశార‌ట‌.

చిన్న‌మ్మ పంపిన జాబితాలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న గిరిజా వైద్య‌నాథ‌న్‌ ను ఆ స్థానం నుంచి తొల‌గించి ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న కె. ష‌న్మ‌గంను నియ‌మించాల‌ని ఉంది. అయితే ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి కీల‌క అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని భావించిన ప‌ళ‌నిస్వామి... ఆ జాబితాను బుట్ట‌దాఖ‌లు చేశార‌ట‌. ఇప్ప‌టికే రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు ప‌రిణాలు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప‌రువును బ‌జారుకీడ్చాయ‌ని భావించిన ప‌ళ‌ని.. చిన్న‌మ్మ ఆదేశాల‌ను అమ‌లు చేసేది లేద‌ని చెప్పేశార‌ట‌.

అంతేకాదండోయ్‌... అమ్మ జైల్లో ఉంటే... ఆమె భ‌క్తుడు ప‌న్నీర్ ఎప్పుడు పిలిస్తే... అప్పుడు జైలు గుమ్మం ముందు వాలిపోయేవారు. ఇందుకు విరుద్ధంగా శ‌శిక‌ళ‌ను క‌లిసేందుకు బెంగ‌ళూరు వెళ్లాలంటేనే ప‌ళ‌ని విసుక్కుంటున్నార‌ట‌. ఇక‌పై బెంగ‌ళూరు వెళ్లేది లేద‌ని కూడా ఆయ‌న తేల్చి చెబుతున్నార‌ట‌. ఏమాత్రం రాజ‌కీయ అనుభ‌వం లేని చిన్న‌మ్మ త‌మ‌కు దిశానిర్దేశం చేయ‌డ‌మేమిట‌ని కూడా ప‌ళ‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే... మే 14న త‌మిళ‌నాట స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకునే దిశ‌గా ప‌ళ‌ని స్వామి ప‌క‌డ్బందీగా అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే త‌ర‌హాలో ప‌ళ‌ని ప‌య‌నిస్తే.. మ‌రికొద్ది నెల‌ల‌ల్లోనే చిన్న‌మ్మ శ‌కం ముగిసిపోయిన‌ట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/