Begin typing your search above and press return to search.

ప‌ళ‌ని ప్లాన్‌.. ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు

By:  Tupaki Desk   |   27 Aug 2017 4:24 AM GMT
ప‌ళ‌ని ప్లాన్‌.. ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు
X
అనూహ్యంగా త‌మిళ సీఎం పీఠం ఎక్కిన ప‌ళ‌ని.. మైనారిటీలో ఉన్న త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు రాజ‌కీయ చ‌తుర‌త‌కు ప‌దును పెడుతున్నారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకు అమ్ముల పొదిలోని అస్త్రాల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ సీఎం ఓ ప‌న్నీర్ సెల్వంతో విభేదాలు స‌మ‌సిపోయేలా చేసుకున్న ఆయ‌న‌.. పార్టీలో ఏర్ప‌డిన సంక్షోభానికి శాశ్వ‌తంగా తెర దించేందుకు ప్రణాళిక‌లు వేస్తున్నారు. ఓపీఎస్ రాక‌తో ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేసిన‌ టీవీవీ దినకరన్‌ - ఆ వ‌ర్గ‌పు ఎమ్మెల్యేల దిమ్మ తిరిగే ఎత్తుగడలు సిద్ధం చేశారు ఇందులో భాగంగా ఆయన డీఎంకే ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు.

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికిన చోటే.. కొత్త స‌మ‌స్య పుడుతుందన‌డానికి త‌మిళ రాజ‌కీయాలే నిద‌ర్శ‌నం! వ్యూహాలు - ప్ర‌తివ్యూహాలు మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఊహించ‌ని ట్విస్టులు.. ఇదీ సూక్ష్మంగా త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితి. సీఎంకు వ్యతిరేకంగా 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే! వీరితో పాటుగా ప్రధాన ప్రతిపక్షం కూడా బల నిరూపణకు పట్టుబడుతోంది. బల నిరూపణ తప్పని సరిగా మారిన పక్షంలో గట్టెక్కేందుకు తగ్గ మార్గాల్ని పళని అన్వేషిస్తున్నారు. సీఎం పళని కొత్త ఎత్తుగడతో బలపరీక్షలో నెగ్గేందుకు వ్యూహరచన చేసి ఉండటం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ వేదికగా గత నెల నిషేధిత గుట్కాల వ్యవహారంపై తీవ్ర రగడ చోటు చేసుకుంది.

నిషేధిత వస్తువులు యథేచ్ఛగా దొరుకుతున్నాయంటూ సభలో గుట్కా ప్యాకెట్లను డీఎంకే సభ్యులు ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని ఆ సమయంలో అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు. శాననసభలో 20 మంది డీఎంకే సభ్యులు గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించినట్టుగా వీడియో ఆధారాల్ని ప్రస్తుతం సేకరించారు. గుట్కా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, ఆ సభ్యులపై చర్యకు ప్రస్తుతం క్రమ శిక్షణా సంఘానికి సిఫారసు చేశారు. తిరుగుబాటు దారులపై అనర్హత వేటు, 20 మంది డీఎంకే సభ్యుల సస్పెండ్‌ వెరసి సభలో సభ్యుల సంఖ్య తగ్గించినట్టు అవుతుందన్న వ్యూహంతో పళని ఈ ఎత్తుగడ వేశార‌ట‌.