Begin typing your search above and press return to search.

హీరోల‌పై హోల్ సేల్ గా క‌సి తీర్చుకున్న సీఎం

By:  Tupaki Desk   |   15 July 2017 10:09 AM GMT
హీరోల‌పై హోల్ సేల్ గా క‌సి తీర్చుకున్న సీఎం
X
సాధార‌ణంగా పేరు ప్ర‌ఖ్యాతులున్న చిత్ర ప్ర‌ముఖుల్ని ప్ర‌భుత్వాలు టార్గెట్ చేయ‌టం దాదాపుగా ఉండ‌వు. అదే స‌మ‌యంలో.. ప్ర‌భుత్వాల్ని ప్ర‌ముఖ హీరోలు సైతం కెలికేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఇలా.. ఎవ‌రి గీత‌ల్లో వారు ఉంటూ.. ఎవ‌రి ప‌ని వారు చేసుకుపోవ‌టం అనుకోని ఆన‌వాయితీగా మారింది. తాజాగా.. అందుకు భిన్న‌మైన సీన్ ఒక‌టి చోటు చేసుకుంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని అగ్ర‌హీరోలంద‌రి మీద హోల్ సేల్ గా క‌సి తీర్చుకున్న వైనం ఇప్పుడు త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది.

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. అగ్ర‌హీరోలంద‌రి మీద‌నా ఇదే రీతిలో విరుచుకుప‌డిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ.. ఏ రీతిలో క‌సి తీర్చుకుంద‌న్న విష‌యంలోకి వెళితే.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా ఉత్త‌మ చిత్రాల‌కు.. క‌ళాకారుల‌కు అవార్డులు ఇవ్వ‌టం మామూలే. అయితే.. గ‌డిచిన కొన్నేళ్లుగా అవార్డుల్ని ఇవ్వ‌టం మానేసింది.

ప్ర‌త్యేకించి కార‌ణం లేకున్నా.. అవార్డుల్ని ఇవ్వ‌టం లేదు.అయితే.. తాజాగా 2009 నుంచి 2014 వ‌ర‌కు సినీ అవార్డుల్ని ఒకేసారి ప్ర‌క‌టించిన ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. సినీ అవార్డుల ప్ర‌క‌ట‌న ఒక సంచ‌ల‌నంగా మారితే .. ఈ అవార్డుల్లో ఏ ఒక్క అవార్డు కూడా కోలీవుడ్ ప్ర‌ముఖ హీరోల‌కు.. వారి చిత్రాల‌కు రాక‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌డిచిన ఆరేళ్ల వ్య‌వ‌ధికి ప్ర‌క‌టించిన ఉత్త‌మ చిత్ర అవార్డుల ప‌ట్టిక‌లో అన్ని చిన్న చిత్రాలే ఉండ‌టం.. ప్ర‌ముఖ న‌టుల‌కు అవ‌కాశం ల‌భించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఒక ఏడాది అనుకుంటే ఓకే. కానీ.. ఆరేళ్ల వ్య‌వ‌ధిలో ప్ర‌ముఖ హీరోలు న‌టించిన ఒక్క సినిమా కూడా లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ తీరుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు మాత్రం ఇప్ప‌టికైనా చిన్న చిత్రాల్ని ప‌ట్టించుకున్నారంటూ హ్యాపీ అవుతున్నారు. ఉత్త‌మ న‌టుల్లో 2009కి క‌రణ్‌.. 2010లో విక్ర‌మ్‌.. 2011లో విమ‌ల్‌.. 2012లో జీవా.. 2013లో ఆర్య‌.. 2014లో సిద్ధార్థ్‌ లు లాంటి యువ న‌టుల‌కు ఉత్త‌మ నటుడి అవార్డు ల‌భించ‌టం గ‌మ‌నార్హం. జాబితాలో ఒక్క ప్ర‌ముఖుడి పేరు లేక‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ఈ ఆరేళ్ల వ్య‌వ‌ధిలో ప్ర‌ముఖ న‌టులు న‌టించిన చిత్రాలు భారీ విజ‌యాల్నే పొందాయి. అయితే.. అవార్డులు మాత్రం రాక‌పోవ‌టం వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టిన జ‌ల్లిక‌ట్టు ఎపికోడ్ లో ప్ర‌ముఖ హీరోలంతా త‌మదైన పాత్ర‌ను పోషించ‌టంపై గుర్రుగా ఉంద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే అగ్ర‌హీరోలు.. వారు న‌టించిన చిత్రాల మీద చిన్న చూపు చూశార‌ని చెబుతున్నారు. ఈ అవార్డుల విష‌యంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల బ‌లంగా వినిపిస్తోంది.