Begin typing your search above and press return to search.

ఛాన‌ళ్ల‌పై ప‌ళ‌నిస్వామి స‌ర్కారు 'ఆరాచ‌కం'!

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:08 AM GMT
ఛాన‌ళ్ల‌పై ప‌ళ‌నిస్వామి స‌ర్కారు ఆరాచ‌కం!
X
రెండు తెలుగు రాష్ట్రాల‌కు పొరుగ‌న ఉన్న త‌మిళ‌నాడులో భావ‌స్వేచ్ఛ మీద ఆరాచ‌కం సాగుతున్న వైనం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌భుత్వాలు చేసే త‌ప్పుల్ని వేలెత్తి చూపించే మీడియా గొంతు నొక్కేయ‌టం కొత్తేం కాకున్నా.. ఈ విష‌యంలో ప‌ళ‌ని స‌ర్కారు అనుస‌రిస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు ఆందోళ‌న స్థాయికి చేరుకుంది. త‌మ‌ను త‌ప్పు ప‌ట్టే వారు ఎవ‌రైనా స‌రే.. ఏ ఛాన‌ల్ అయినా స‌రే.. వారికి ఊహించ‌ని రీతిలో షాకివ్వ‌టం త‌మిళ‌నాడు స‌ర్కారుకు ఈ మ‌ధ్య‌న అల‌వాటుగా మారింది.

దీంతో.. ప్ర‌భుత్వం పైనా విమ‌ర్శ‌లు చేయాలంటేనే వ‌ణికిపోతున్న ప‌రిస్థితి. ఎమ‌ర్జెన్సీ రోజుల్ని త‌ల‌పించేలా ప‌ళ‌ని స‌ర్కారు అనుస‌రిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌లు ప్ర‌సారం చేసినా.. ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించేలా వార్త‌లు వ‌చ్చినా.. స‌ద‌రు ఛాన‌ల్ ప‌రిస్థితి ఏమ‌వుతుంద‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేనట్లుగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

మిగిలిన రాష్ట్రాల‌కు భిన్నంగా త‌మిళ‌నాడులో కేబుల్ నెట్ వ‌ర్క్ ఉంది. దివంగ‌త అమ్మ‌.. ఎన్నిక‌ల హామీల్లో భాగంగా.. ప్ర‌భుత్వ కేబుల్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌టం.. కారుచౌక‌గా కేబుల్ క‌నెక్ష‌న్లను ఇచ్చింది. నాణ్య‌మైన కేబుల్ ప్ర‌సారాలు అది కూడా అతి త‌క్కువ ధ‌ర‌కు కావ‌టంతో..త‌మిళ‌నాడు వ్యాప్తంగా 60 శాతానికి పైగా కేబుల్‌ క‌నెక్ష‌న్లు ప్ర‌భుత్వానికి చెందిన అర‌సు కేబుల్ టీవీ కార్పొరేష‌న్ పేరిటే ఉన్నాయి.

దీంతో.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాల్ని ప్ర‌సారం చేసిన వెంట‌నే.. ఆ ఛాన‌ల్‌ ను కేబుల్ నెట్ వ‌ర్క్ నుంచి తీసి వేయ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌..ఆమె ప్రాతినిధ్యం వ‌హించిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ లో దిన‌క‌ర‌న్ గెలిచే అవ‌కాశం ఉందంటూ కావేరీ టీవీ త‌న ఎగ్జిట్ పోల్స్ ప‌లితాల్ని వెల్ల‌డించింది. అంతే.. ఆ ఛాన‌ల్‌ ను అర‌సు కేబుల్ నెట్ వ‌ర్క్ నుంచి తొల‌గించేశారు.

అంతేనా.. ఫిబ్ర‌వ‌రిలో తూత్తుకుడిలో వేదాంత కర్మాగారానికి వ్య‌తిరేకంగా సాగుతున్న నిర‌స‌న‌ల్ని ప్ర‌సారం చేసిన న్యూస్ 18 త‌మిళ‌నాడుకు ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఇదే అంశంపై నిర‌స‌న‌ల్ని క‌వ‌ర్ చేసిన స‌త్యం ఛాన‌ల్ సైతం అర‌సు కేబుల్ నెట్ వ‌ర్క్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.

ఇక‌.. తూత్తుకూడి నిర‌స‌న‌ల‌పై చ‌ర్చ‌ను ప్ర‌సారం చేసిన పుదియా త‌లైమురై టీవీ ఛాన‌ల్‌ను కేబుల్ నెట్ వ‌ర్క్ లో 124వ స్లాట్ నుంచి ఏకంగా 499 స్లాట్‌కు మార్చేశారు. దీంతో.. ప‌ళ‌ని స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఏం చేసినా వెంట‌నే ఫ‌లితాన్ని చ‌వి చూడాల్సి రావ‌టంతో.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌ల విష‌యంలో టీవీ ఛాన‌ళ్లు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. భావ‌స్వేచ్ఛ గొంతు నొక్కేసే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ వైనం ఇదే రీతిలో కొన‌సాగినా.. ఇత‌ర రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రులు ఇలానే వ్య‌వ‌హ‌రించినా.. భావ‌స్వేచ్ఛ‌కు గ‌డ్డు రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.