Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీలో కూర్చున్నా.. ఇలా చేసుడేంది ప‌ళ‌ని?

By:  Tupaki Desk   |   17 April 2019 7:32 AM GMT
సీఎం కుర్చీలో కూర్చున్నా.. ఇలా చేసుడేంది ప‌ళ‌ని?
X
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి అడ్డంగా బుక్ అయ్యారు. ఎన్నిక‌ల వేళ‌.. అందునా ప్ర‌తి ఒక్క‌రి చేతిలో సెల్ ఫోన్లు ఉన్న వేళ‌.. ప్ర‌తి క‌ద‌లిక రికార్డు అయ్యే ప‌రిస్థితి. సామాన్యుల సంగ‌తి ఎలా ఉన్నా ప్ర‌ముఖులు క‌నిపించినంత‌నే.. అర‌చేతిలో ఫోన్ ఒక్క‌సారిగా కెమెరా మోడ్ లోకి వెళ్లిపోతున్న ప‌రిస్థితి. అలాంటిది ఎన్నిక‌ల వేళ‌.. సీఎం లాంటి వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌చారం చేస్తుంటే.. హ‌డావుడి ఎంత‌లా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

12 రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 97 ఎంపీ స్థానాల‌కు జ‌రుగుతున్న పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది. పోలింగ్ కు 48 గంట‌ల ముందు ప్ర‌చారం ముగియ‌టం తెలిసిందే. ప్ర‌చారం మీద ప‌రిమితులు.. ఈసీ డేగ క‌న్ను చూస్తున్నా.. అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు మాత్రం చెల‌రేగిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు.

విప‌క్ష నేత‌ల‌కు ఐటీ..ఈడీ సోదాల‌తో వ‌రుస పెట్టి షాకుల మీద షాకులు ఎదురువుతున్న ప‌రిస్థితి. విప‌క్షాల ప‌రిస్థితి ఇలా ఉంటే.. అధికార‌ప‌క్ష నేత‌ల తీరు అందుకు భిన్నంగా ఉందంటున్నారు. త‌మ‌ను సోదాల పేరుతో ఇబ్బంది పెడుతున్న అధికారులు.. అధికార‌ప‌క్షం వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదంటున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి సంబంధించిన ఒక ఉదంతాన్ని చూపిస్తున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒక పండ్ల దుకాణం ద‌గ్గ‌రి మ‌హిళ‌కు త‌మ పార్టీకే ఓటు వేయాల‌ని కోరారు. దీంతో ఆమె త‌న ద‌గ్గ‌రి అర‌టిపండ్లు ఇచ్చింది. స‌ద‌రు మ‌హిళ‌కు పాంప్లెట్ తో పాటు.. ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి డ‌బ్బులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ గా మారింది. పండ్లు ఇచ్చిన మ‌హిళ‌కు ప్ర‌తిఫ‌లంగా డ‌బ్బు ఇవ్వ‌టం విడి రోజుల్లో ఓకే. కానీ.. ఫ‌లానా అభ్య‌ర్థికి ఓటు వేయాల‌ని కోరుతూ.. పాంప్లెట్ తో పాటు డ‌బ్బులు ఇవ్వ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చొని మ‌రీ ఇంత చిల్ల‌ర‌గా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటంటూ ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. పండ్లు ఇస్తే తీసుకోవాలె కానీ.. ఇలా డ‌బ్బులు ఇచ్చుడేంద‌న్న విమ‌ర్శ ఉంది. అయినా.. అధికార ప‌క్షంలో ఉన్న వారు.. అందునా మోడీకి మిత్రులుగా ఉండే వారు ఇలాంటివేం చేసినా పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌ద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తూ ఉంది. ఈ మాట‌ల్ని ఈసీ వింటోందా?