Begin typing your search above and press return to search.

ఇంటికి పిలిచి మ‌రీ మంత్రుల‌కు సీఎం క్లాస్‌

By:  Tupaki Desk   |   1 Oct 2017 5:26 AM GMT
ఇంటికి పిలిచి మ‌రీ మంత్రుల‌కు సీఎం క్లాస్‌
X
అమ్మ అనారోగ్యంపై ఇటీవ‌ల కాలంలో వ‌స్తున్న వార్త‌లు సంచ‌ల‌నాల మీద సంచ‌నాలు సృష్టిస్తున్నాయి. అమ్మ మ‌ర‌ణం వెనుక ఏదో విష‌యం ఉంద‌ని న‌మ్మే స‌గ‌టుజీవి న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచేలా వ‌స్తున్న వార్త‌ల‌పై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఉన్నఅన్నాడీఎంకే నేత‌ల మాట‌లు ఆయ‌న‌కు చిరాకు తెప్పిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌తిప‌క్షానికి అవ‌కాశం ఇచ్చేలా.. బ‌లం పెంచేలా మంత్రుల వ్యాఖ్య‌లు ఉంటున్నాయ‌ని.. ఒక‌దానితో మ‌రొక‌టి సంబంధం లేకుండా చేస్తున్న వ్యాఖ్య‌లు ఎంత‌మాత్రం స‌రికావ‌ని.. ఇలాంటి త‌ప్పులు ఎలా చేస్తారంటూ ఆయ‌న మండిప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆసుప‌త్రిలో అమ్మ ఉన్న వేళ‌.. ఆమె ఆరోగ్యం మంత్రులు ఒక్కొక్క‌రు ఒక్కోలా రియాక్ట్ కావ‌టం ఏమిటని ప్ర‌శ్నించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రుల కార‌ణంగా ప్ర‌భుత్వం ఇరుకున ప‌డుతుంద‌ని.. చెప్పే మాట‌లు ఆచితూచి ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఇక‌పై అమ్మ ఆరోగ్యంపై మాట్లాడే మంత్రులంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. మంత్రులంద‌రిని త‌న నివాసానికి పిలిపించుకున్న సీఎం ప‌ళ‌నిస్వామి.. అంద‌రికి క‌లిసి హోల్ సేల్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. త‌మిళ‌నాడు అధికార‌ప‌క్ష నేత‌లు అమ్మ ఆరోగ్యంపై చేస్తున్న వ్యాఖ్య‌లు విప‌క్ష డీఎంకేకు ఒక అవ‌కాశంగా మారింది. అన్నాడీఎంకే నేత‌లు చెబుతున్న పొంత‌న‌లేని మాట‌ల‌పై విప‌క్ష నేత స్టాలిన్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. అమ్మ మ‌ర‌ణంపై ప్ర‌జ‌ల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని.. మంత్రులు శ్రీనివాస‌న్‌.. సెల్లూరు రాజుకు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌ల్ని చేస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.

అమ్మ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో ఉన్న వేళ త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రుల‌నే కాదు.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిని.. ఢిల్లీ నుంచి వ‌చ్చినోళ్ల‌ను.. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సీహెచ్ విద్యాసాగర్ రావును.. ఎయిమ్స్‌.. లండ‌న్ వైద్యుల‌ను కూడా విచారించాల్సిన అవ‌స‌రం ఉందంటూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.