Begin typing your search above and press return to search.

ఇవాల్టి ‘‘పాలెం’’ రేపటి మహా నగరం

By:  Tupaki Desk   |   22 July 2015 6:02 AM GMT
ఇవాల్టి ‘‘పాలెం’’ రేపటి మహా నగరం
X
నిన్నటి వరకూ ఎవరికి తెలీని మూడు గ్రామాల దశ.. దిశ తిరిగిపోతుంది. లక్షలాది గ్రామాల్లో తమది ఒకటిగా ఉన్న మూడు ఊళ్లకు మహాభాగ్యం దక్కనుంది. ఇంతకాలం ఎలాంటి పేరు ప్రఖ్యాతులు.. ప్రత్యేకత.. గుర్తింపు లేని ఆ ఊళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారనున్నాయి.

ఏపీ రాజధాని కోసం సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ పుణ్యమా అని.. రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన రాజధాని ప్రాంతం (సీడ్ క్యాపిటల్) మూడు గ్రామాలకే పరిమితం కానుంది. కృష్ణా తీరాన ఉన్న ఈ మూడు గ్రామాల చివరి పేర్లు ఒకటే కావటం ఒక విశేషం అయితే.. ఏపీ రాజధానికి సంబంధించి అత్యంత కీలక పరిణామాలు ఈ మూడు ఊళ్ల పరిధిలో జరగనున్నాయి.

ప్రపంచం మొత్తం ఏపీ రాజధాని గురించి చర్చించుకునేలా చేస్తానని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కానీ నిజమైన పక్షంలో.. ఈ మూడు గ్రామాల పేర్లు అంతర్జాతీయంగా మారు మోగనున్నాయి.

ఉద్దండరాయుని పాలెం.. తాళ్లాయ పాలెం.. లింగాయ పాలెం.. మూడు గ్రామాల్ని ఏపీ రాజధాని పరిపాలన కేంద్రంగా మారనుంది. ఇంతా చేస్తే ఈ మూడు గ్రామాల విస్తీర్ణం కేవలం 16.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే. తాజాగా సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్ లో సీడ్ క్యాపిటల్ ను మూడు గ్రామాలకే పరిమితం చేయాలని నిర్ణయించటంతో.. ఆ సంగతి తెలుసుకున్న ఆ మూడు గ్రామాల వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. తాజాగా ఆ ఊళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది.

నిజానికి ఆ ఊళ్లకు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఏ దశాబ్దానికో కూడా రాని పరిస్థితి. అలాంటిది.. ఇకపై ఆ ఊళ్లల్లోనే ముఖ్యమంత్రి మొదలు.. మంత్రులు.. పెద్ద పెద్ద అధికారులే కాదు.. మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే అక్కడ కొలువు తీరుతుందన్న కబురు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటివరకూ అనామకంగా ఉన్న ఈ మూడు ఊళ్లు రానున్న రోజుల్లో వీవీఐపీ ప్రాంతాలుగా మారిపోవటమే కాదు.. అమరావతి మహానగరంలో అత్యంత కీలకం కానున్నాయన్న ఆలోచన వారిలో మరింత హుషారెక్కిస్తోంది.