Begin typing your search above and press return to search.

హిమాన్షు మోటార్స్ కేటీఆర్ దే కానీ..

By:  Tupaki Desk   |   28 July 2017 6:03 AM GMT
హిమాన్షు మోటార్స్ కేటీఆర్ దే కానీ..
X
గ‌డిచిన కొద్ది రోజులుగా తెలంగాణ అధికార ప‌క్షానికి.. విపక్షానికి మ‌ధ్య ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు సాగుతున్నాయి. త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ కావ‌టం తెలిసిందే. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ నేత‌ల్ని మాట‌ల‌తో బ‌ట్ట‌లు ఊడ‌దీసినంత ప‌ని చేసిన కేటీఆర్‌.. ఎప్పుడూ లేని రీతిలో క‌దిలిపోయారు. త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసి.. త‌న మీద చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని నిరూపించ‌గ‌ల‌రా? అంటూ స‌వాలు విసిరారు.

హిమాన్షు మోటార్స్ కంపెనీ పేరుతో పోలీసుల‌కు కొనుగోలు చేసిన వాహ‌నాల్ని కేటీఆర్ సంస్థే కొనుగోలు చేసింద‌న్న ఆరోప‌ణ‌లు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించాయి. అస‌లు కేటీఆర్‌ కు హిమాన్షు మోటార్స్ అన్న సంస్థ ఉందా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది. ఇదే విష‌యాన్ని తాజాగా ప్ర‌భుత్వ విప్ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన ఆయ‌న‌.. మంత్రి కేటీఆర్‌ కు ఏడేళ్ల క్రితం హిమాన్షు మోటార్స్ సంస్థ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. ఆ సంస్థ ఎలాంటి లావాదేవీలు జ‌ర‌ప‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ నేత‌లు చిత్త‌కార్తె కుక్క‌ల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. మంత్రి కేటీఆర్ త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పిస్తే అప్పుడే ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. సీపీఎం నేత‌లు ప‌దే ప‌దే ఒకే అబ‌ద్ధాన్ని చెబుతూ దాన్ని నిజం చేయాల‌ని భావిస్తున్నార‌న్నారు. పోలీసు వాహ‌నాల కొనుగోలులో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని.. ఎవ‌రికైనా అనుమానాలు ఉంటే వాటిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏ ద‌ర్యాప్తు సంస్థ‌నైనా కోరాల‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ల్లా మాట‌లు వింటే.. కేటీఆర్ మీద కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని తీవ్ర‌స్థాయిలో తిప్పి కొట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.