Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల టెంపుల్ పిచ్చాసుప‌త్రా?

By:  Tupaki Desk   |   12 April 2017 7:52 AM GMT
త‌మ్ముళ్ల టెంపుల్ పిచ్చాసుప‌త్రా?
X
దూకుడు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాక ముందు వెనుకా చూసుకోకుండా మాట్లాడేయ‌టం ఇప్పుడు మామూలుగా మారిపోయింది. ఎవ‌రెంత దురుసుగా.. దూకుడుగా మాట్లాడితే వారే మొన‌గాడ‌న్న వీర‌తాడు వేసేస్తున్న వేళ‌.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ అంత‌కంత‌కూ దిగ‌జారి మాట్లాడ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది. రాజ‌కీయంగా విభేదాలు ఎన్ని ఉన్నా.. ప‌రిధి దాటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఈ మ‌ధ్య‌న మ‌రీ ఎక్కువైంది. తాజాగా చేసిన ఈ వ్యాఖ్య చూస్తే ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తుంది.

తెలంగాణ‌లో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం ప్ర‌స్తుత ప‌రిస్థితి ఎలా ఉందో తెలిసిందే. అదే స‌మ‌యంలో ఒక‌ప్పుడు ఉనికి కోసం పార్టీ షురూ చేసి.. కిందామీదా ప‌డిన కేసీఆర్‌.. త‌ర్వాతి కాలంలో తిరుగులేని రీతిలో పార్టీని నిర్మించ‌టం.. అధికారాన్ని చేజ‌క్కించుకోవ‌ట‌మే కాదు.. తెలంగాణ‌లో ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే పార్టీ మ‌రేదీ లేద‌న్న‌ట్లుగా మార్చ‌టం తెలిసిందే.

బ‌లం పెరిగిన‌ప్పుడు.. అవ‌కాశం చిక్కిన‌ప్పుడు ప్ర‌త్య‌ర్థికి ఊపిరి ఆడ‌కుండా చేయటం ద్వారా.. బ‌లాన్ని మ‌రింత పెంచుకోవాల‌న్న సూత్రాన్ని టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు అనుస‌రిస్తున్నారు. ఇందుకు అధినేత‌ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. త‌మ ప్ర‌త్య‌ర్థుల్ని ప‌నికిరాని పూచిక పుల్ల‌లుగా తీసి పారేయ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అల‌వాటే. ఆయ‌న బాట‌లోనే న‌డుస్తున్న ఆయ‌న వార‌సుడు కేటీఆర్ కావొచ్చు.. మేన‌ల్లుడు హ‌రీశ్ రావులు కావొచ్చు.. విప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అంత సీన్ లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

మొన్నటికి మొన్న టీడీపీ చ‌చ్చిన పాముతో పోల్చిన హ‌రీశ్‌.. కాంగ్రెస్ పార్టీ విష‌యానికి వ‌చ్చిన‌ప్పుడు.. ఆ పార్టీ ప‌ని అయిపోయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టీటీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు మండ‌లి విప్ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి. చ‌చ్చిన పాము లాంటి టీడీపీ మీద ప‌ల్లా మ‌రీ ఇంత ఘాటుగా విరుచుకుప‌డ‌టానికి కార‌ణం లేక‌పోలేదు.

మొన్నామ‌ధ్య టీటీడీపీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ మాట్లాడుతూ.. తాము కానీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టించుకున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ ను ఆసుప‌త్రిగా మారుస్తామ‌ని చెప్ప‌టం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా హ‌ర్ట్ అయిన‌ట్లున్నారు ప‌ల్లా. అందుకే.. తెలుగు త‌మ్ముళ్లు త‌మ దేవాల‌యంగా ఫీల‌య్యే ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌ ను పిచ్చాసుప‌త్రిగా అభివ‌ర్ణించారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయి.. స్థిమితం కోల్పోయిన టీడీపీ నేత‌ల‌తో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ పిచ్చాసుప‌త్రిగా మారింద‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ తెలంగాణ‌కు దారి చూపుతోంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గురించి మాట్లాడే అర్హ‌త టీడీపీ నేత‌ల‌కు లేద‌ని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు మామూలే కానీ.. శ్రుతిమించిన రీతిలో ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు అంత మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/