Begin typing your search above and press return to search.

బాబును షెడ్డుకు పంపించాలా పల్లె?

By:  Tupaki Desk   |   7 April 2016 11:22 AM GMT
బాబును షెడ్డుకు పంపించాలా పల్లె?
X
ఏపీ అధికారపక్షంలో ఇప్పుడు లోకేశ్ హడావుడి పెరుగుతోంది. చినబాబును మంత్రివర్గంలోకి తీసుకొస్తారన్న టాక్ మొదలు కావటమే కాదు.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న లోగుట్టు సమాచారంతో తెలుగు తమ్ముళ్లు అలెర్ట్ అయిపోతున్నారు. ఎవరికి వారు జాగ్రత్త పడాలన్నట్లుగా.. లోకేశ్ సత్తాను కీర్తించేందుకు పోటీ పడుతున్నారు. అయితే.. ఇది హద్దులు దాటనంతవరకూ బాగానే ఉంటుంది. కానీ.. తమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే అలా కనిపించటం లేదు. లోకేశ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ్ముళ్ల ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అదేదీ హద్దులు దాటకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి హెచ్చరికను చేసేలా ఉంది తాజాగా మంత్రి పల్లె రఘునాధరెడ్డి చేసిన వ్యాఖ్యలు.

లోకేశ్ చంద్రబాబుకు ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు చెట్టు అయితే.. లోకేశ్ ఆ చెట్టుకు కాచిన పండు మాత్రమే తప్ప.. చెప్పుకును మించిపోయే మహా వృక్షం కాదన్నది మర్చిపోకూడదు.కానీ.. మంత్రి పల్లె మాటలు చూస్తే అలా కనిపించటం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటేలా ఉన్నాయన్న భావన కలుగుతోంది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ గా పల్లె వ్యాఖ్యానించారు. మిగిలిన మంత్రులంతా ఏపీ క్యాబినెట్ లో లోకేశ్ కీలకభూమిక పోషించాలన్న వ్యాఖ్య చేస్తే.. పల్లె అందుకు భిన్నంగా.. లోకేశ్ ను కాబోయే సీఎంగా కీర్తించటం గమనార్హం

వినేందుకు పల్లె మాటలు బాగానే ఉన్నా.. అలాంటివి లేనిపోనికన్ఫ్యూజ్ కు క్రియేట్ చేస్తాయని చెప్పొచ్చు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన రిటైర్మెంట్ గురించి ఏమీ ఆలోచించట్లేదు. ఆ మాటకు వస్తే.. ఆయన తర్వాతి టర్మ్ ను కూడా విజయవంతంగా పూర్తి చేస్తానన్న ధీమాలో ఉన్నారు. అలాంటప్పుడు లోకేశ్ ను కాబోయే సీఎంగా ప్రకటించటం అర్థం లేనిది. నిజానికి లోకేశ్ ఇప్పటివరకూ తనను తాను ఫ్రూవ్ చేసుకోలేదనే విషయాన్ని మర్చిపోకూడదు. లోకేశ్ ను పొగడొద్దని చెప్పటం లేదు కానీ.. ఆ పేరుతో చంద్రబాబును తక్కువ చేసినట్లుగా మాటలు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని పల్లో లాంటి నేతలు గుర్తిస్తే మంచిది. బాబు ఇంకా షెడ్డుకు వెళ్లలేదని.. వెళ్లాల్సిన అవసరం లేనప్పుడు.. తమ అత్యుత్సాహంతో ఆయన్ను షెడ్డుకు పంపిస్తున్నట్లుగా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయాన్ని గుర్తిస్తే పార్టీకి.. లోకేశ్ కి మంచిది.