Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పై త‌మ్ముళ్ల అనుమానాల్లో నిజ‌మెంత‌?

By:  Tupaki Desk   |   15 March 2018 6:34 AM GMT
ప‌వ‌న్ పై త‌మ్ముళ్ల అనుమానాల్లో నిజ‌మెంత‌?
X
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్లుగా చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను గ‌డిచిన నాలుగేళ్లుగా ఎంత‌మంది విమ‌ర్శించారో లెక్క లేదు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న లోపాల్ని.. ఆయ‌న చేస్తున్న త‌ప్పుల‌పై మాట వ‌ర‌స‌కు ప్ర‌స్తావించ‌ని ప‌వ‌న్‌.. ఇప్పుడు అందుకు భిన్నంగా చెల‌రేగిపోయి మాట్లాడటం.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌ట‌మే కాదు.. లోతైన విమ‌ర్శ‌లు చేశారు.

నాలుగేళ్ల బాబు పాల‌న‌పై బ‌హిరంగ స‌భ‌లో అశేష జ‌న‌సందోహం సాక్షిగా చిన్న‌పాటి స‌మీక్షే చేసేశారు. అవినీతి.. భూకబ్జాలు.. ఇసుక మాఫియా మొద‌లుకొని చంద్ర‌బాబు కుమారుడిపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప‌వ‌న్ ప్ర‌సంగం ఈ త‌ర‌హాలో ఉంటుంద‌ని ఏ మాత్రం ఊహించ‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు భారీ షాక్ త‌గిలిన‌ట్లైంది. ప‌వ‌న్ విమ‌ర్శ‌లకు ఎలా స‌మాధానం చెప్పాల‌న్న అంశంపై రాత్రంతా మ‌ధ‌నం చేశారో.. లేక అధినేత ఆదేశాల కోసం ఎదురుచూశారో కానీ.. ఈ రోజు (గురువారం) ఉద‌యం నుంచి ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్ పై విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి.. టీడీపీ సీనియ‌ర్ నేత ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయ్యారు. ప‌వ‌న్ కు ఆవేశం ఉందే త‌ప్పించి ఆలోచ‌న లేద‌న్నారు. నాలుగేళ్లు త‌మ‌తో ఉండి అక‌స్మాత్తుగా విమ‌ర్శ‌లు చేయ‌టం అనుమానాల‌కు దారి తీస్తోంద‌న్నారు. ప‌వ‌న్ వెనుక బీజేపీ హ‌స్తం ఉండొచ్చ‌ని.. ఆయ‌న్ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.

శేఖ‌ర్ రెడ్డి కేసులో లోకేశ్ హ‌స్తం ఉంద‌ని ప‌వ‌న్ ఆరోపించ‌టంలో అర్థం లేద‌న్నారు. త‌మ అధినేత చంద్ర‌బాబును శేఖ‌ర్ రెడ్డి రెండుమార్లు మాత్ర‌మే క‌లిశార‌ని.. లోకేశ్ ను అస్స‌లు క‌ల‌వ‌లేద‌న్నారు. ఇలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌టం స‌రికాద‌న్న ప‌ల్లె.. ప‌వ‌న్ ప‌రిణితి చెందిన నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్నారు. లోకేశ్ పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని ఖండించిన ఆయ‌న‌.. ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఒక‌వేళ ప‌ల్లె మాట నిజ‌మ‌ని అనుకుందాం. ప‌వ‌న్ కు బీజేపీకి లింకు ఉండి ఉంటే.. బ‌హిరంగ స‌భ ఆరంభంలోనే దాదాపు ఏడెనిమిది నిమిషాలు కేంద్రంపైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం.. జైట్లీకి అర్థం కావాల‌న్న ఉద్దేశంతో ఇంగ్లిషులో మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు ప‌ల్లె స‌మాధానం చెబితే బాగుంటుందంటున్నారు. ప‌వ‌న్ ను తిట్టే ముందు త‌మ్ముళ్లు కాస్తంత హోం వ‌ర్క్ చేస్తే మంచిద‌ని.. లేకుంటే అన‌వ‌స‌రంగా బుక్ అవుతారన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.