Begin typing your search above and press return to search.

జేసీ..నీ అండ చూసుకొని రెచ్చిపోతే ఊరుకోను

By:  Tupaki Desk   |   9 Sep 2017 7:38 AM GMT
జేసీ..నీ అండ చూసుకొని రెచ్చిపోతే ఊరుకోను
X
త‌మ‌ది క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ అని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఎంత‌గా చాటిచెప్పుకుంటున్న‌ప్ప‌టికీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఉంద‌నే అభిప్రాయం ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. జంప్ జిలానీ నేత‌లు పార్టీ సీనియ‌ర్ల మ‌ధ్య వివాదం ఎప్పట్నుంచో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా జంప్ జిలానీ నేత‌ల అనుచ‌రులు వ‌ర్సెస్ తెలుగుదేశం నేత‌లు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది. తాజాగా అనంత‌పురం జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గ‌మైన పుట్ట‌ప‌ర్తిలో ఇదే సంఘ‌ట‌న జ‌రిగింది. ఏకంగా మాజీ మంత్రికి మండిపోయి తెలుగుదేశం నేత‌ను హెచ్చ‌రించారు.

గ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీ సీనియ‌ర్ నేత‌ పల్లె రఘునాథరెడ్డి ప‌ద‌విని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు. అయితే టీడీపీ నాయకుడు కొండసాని సురేష్‌ రెడ్డి ఇటీవ‌ల ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా మ‌రోమారు ఇలాగే జ‌ర‌గ‌డంతో ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ట దిగజార్చొద్దని హితవు పలికినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం నియోజవర్గం లో చర్చనీయాశంగా మారింది.

పుట్టపర్తి సమీపాన బుక్కపట్నం చెరువులో కొంతమంది అనుచరులతో కలిసి కొండసాని సురేష్‌ రెడ్డి గురువారం జలసిరికి హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే పల్లె తీవ్రంగా స్పందించారు. కొండసానికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. తాను పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని, ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు తన కనుసన్నల్లోనే జరగాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏమైనా చేయాలంటే తన అనుమతి తప్పనిసరి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ``ఇక్కడి వ్యవహారాలు చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు మీకు బాధ్యతలు అప్పజెప్పారా లేక మరెవరైనా ఆదేశించారా? పార్టీ ప్రతిష్ట కాపాడాలని ఇదంతా చేస్తున్నావా లేక దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నావా`` అని ప్రశ్నించినట్లు సమాచారం. నియోజకవర్గానికి తానొక్కడినే ఇన్‌చార్జినని, తనకు పార్టీ అధిష్టానం, సీఎం చంద్రబాబు ఆదేశమే శిరోధార్యం అని పల్లె అన్నట్లు సమాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి - ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మ‌నిషిగా కొండ‌సానిని భావిస్తున్న నేప‌థ్యంలో వారి దృష్టికి జరిగిన విషయాన్ని పల్లె ర‌ఘునాథరెడ్డి తీసుకువెళ్లారు. ఈ సంద‌ర్భంగా కొండసాని గురించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా తాము కొండసానిని ప్రోత్సహించడంలేదని, ఇందులో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని వారు పల్లెకు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పల్లె ర‌ఘునాథ్‌ రెడ్డి తీరుపై కొండసాని తీవ్రంగా స్పందిచారు. తనకు, తన కుటుంబసభ్యులకు పల్లె రఘునాథరెడ్డి నుండి హాని ఉందంటూ కొండసాని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు తన గ్రూపు సభ్యులకు పంపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా తెలుగుదేశం నేతే ప్రాణ‌హాని సందేశం పంప‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందని చ‌ర్చ జ‌రుగుతోంది.