Begin typing your search above and press return to search.

పండుగ‌కు పల్లెవెలుగు క‌దిలేనా...!

By:  Tupaki Desk   |   4 Oct 2019 6:30 AM GMT
పండుగ‌కు పల్లెవెలుగు క‌దిలేనా...!
X
ద‌స‌రా పండుగొచ్చింది... ద‌ర్జాగా ఎవ్వ‌రి ఊర్ల‌కు వారు వెళ్ళేందుకు స‌మాయ‌త్తం అవుతున్న వేళ‌... పిల్లా పాప‌ల‌తో త‌మ సొంతూరుకు పోదామ‌ని సంబురప‌డుతున్న స‌మ‌యం... మూటా ముల్లే స‌ర్ధుకొని ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో అనుకుంటున్న త‌రుణంలో... పిడుగులాంటి వార్త‌.. ఆర్టీసీ బ‌స్సులు న‌డువ‌ట్లేద‌ట‌... న‌డుప‌ర‌ట‌.. ఆర్టీసీ కార్మికులు త‌మ హక్కుల సాధ‌న కోసం ఈనెల 5నుంచి స‌మ్మె చేయ‌నున్నార‌ట.. ఈ స‌మ్మె మొద‌లైందంటే ఇక ప‌ల్లెవెలుగు ఉరుకులు ప‌రుగులు ఉండ‌వు.. దీంతో ఊరుకు పోదామ‌నుకున్న‌వారికి న‌ర‌క‌యాత‌న త‌ప్ప‌దు.


ప‌ల్లెకు పోయేందుకు ప‌ల్లెవెలుగు జాడుండ‌దు... ప్రైవేటు వాహానాల నిలువుదోపిడి.. రైళ్ళ‌ల్లో నిలుచోనికి చోటుండ‌దు.. ఏమీ చేసేది ప‌ల్లెకు పోయేదెట్లా... ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్న ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఈరోజు రాత్రివ‌ర‌క‌న్నా దొర‌కుతుందో లేదో ? చూడాలి. ఆర్టీసీ యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం క‌లిసి, కార్మికుల హ‌క్కుల‌ను, డిమాండ్ల‌ను ఏమేర‌కు నెర‌వేర్చుతారో.. ప‌ల్లెవెలుగు చ‌క్రాలు ఆగిపోతాయా.. ముందుకు క‌దులుతాయో వేచిచూడాలి.


ఇంత‌కు కార్మికుల హ‌క్కులు ఏంటో ప‌రిశీలిస్తే... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీకి బకాయిపడ్డ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలి, భవిష్యత్తులో పెండింగ్‌ పెట్టకుండా నిధులు విడుదల చేయాలి. డీజిల్‌ భారాన్ని ప్రభుత్వమే భరించాలి, మోటార్‌వెహికల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలి. అన్ని రకాల పన్నులను మినహాయించాలి. కండక్టర్‌ డ్రైవర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి. వేతన సవరణ వెంటనే చేపట్టాలి. 2017 ఏప్రిల్‌ నుంచి బకాయిలు చెల్లించాలి. ఆర్టీసీలోని అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. సీసీఎస్, పీఎఫ్, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలి. ఆర్టీసీలో అద్దె బస్సులను రద్దు చేసి కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి..


కేంద్రప్రభుత్వం బ్యాటరీ బస్సులకు ఇచ్చే రాయితీ ప్రయోజనం ప్రైవేటు సంస్థలకు కాకుండా ఆర్టీసీకే చెందేలా ఆ బస్సులు సొంతంగా సమకూర్చుకోవాలి. తార్నాక ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలను నియంత్రించాలి. మెట్రో రైలుకు ఇచ్చినట్లు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ను ఆర్టీసీకి కూడా ఇవ్వాలి వంటి డిమాండ్ల‌తో ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇదే ప్ర‌భుత్వం కూడా ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేయాల‌ని నిర్ణ‌యిస్తే ఎట్టిప‌రిస్థితుల్లో ఉపేక్షించేది లేద‌ని, ఎస్మా ప్ర‌యోగిస్తామ‌ని హెచ్చ‌రిస్తోంది.


ద‌స‌రా పండుగ పూట ప్ర‌జ‌ల‌ను ఎలాగైనా వారి గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తామ‌ని మాటిస్తుంది.. ప్ర‌భుత్వం, యాజ‌మాన్యం ఓవైపు క‌మిటీ ఏర్పాటు చేసి చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. మరోవైపు ప్ర‌త్యామ్న‌య ఏర్పాట్లు చేస్తూనే ఉంది.. ఓలా, ఉబ‌ర్, ప్రైవేటు వాహానాల య‌జ‌మానుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌త్యామ్న‌య ఏర్పాటు చేసేందుకు ఓవైపు ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా ప‌ల్లెవెలుగు రాకుంటే పండుగ‌కు ఇళ్ల‌కు చేర‌డం క‌ష్ట‌మేనంటున్నారు ప్ర‌జ‌లు.. స‌మ్మెనా.. ప‌ల్లె వెలుగు ప‌రుగులా ఈ రోజు రాత్రివ‌ర‌కు తేలిపోనున్న‌ది