Begin typing your search above and press return to search.

సంక్రాంతి తరువాత కేంద్ర ప్రభుత్వంలో టీఆరెస్

By:  Tupaki Desk   |   19 Nov 2015 11:43 AM GMT
సంక్రాంతి తరువాత కేంద్ర ప్రభుత్వంలో టీఆరెస్
X
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని... తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు కేంద్ర మంత్రి ఇప్పించుకోవాలని చాలాకాలంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అప్పట్లో బీజేపీకి తమది అత్యంత బలమైన పార్టీ అన్న విపరీతమైన గర్వం ఉండడం.. కేసీఆర్ ను చేర్చుకుంటే చంద్రబాబుతో ఉన్న దోస్తీ పోతుందేమోనన్న ఉద్దేశంతో కేసీఆర్ ను, టీఆరెస్ ను ఎన్డీయే దూరంగానే ఉంచింది. టీఆరెస్ నుంచి పలుమార్లు సానుకూల సంకేతాలు వెళ్లినా బీజేపీ మాత్రం నో వేకెన్సీ బోర్డు పెట్టేసింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సమీకరణాలు మారి సంక్రాంతి తరువాత టీఆరెస్ కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజకీయ పండితులు, కేసీఆర్ వ్యతిరేకులు కూడా టీఆరెస్ వచ్చే ఏడాది ఎన్డీయేలో చేరడం ఖాయమని సూత్రీకరిస్తున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల తరువాత ఈ చేరిక ఉంటుందని చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థనరెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల వరకే టీఆరెస్ సింగల్ గా ఉంటుంది. ఆ తరువాత అది ఎన్డీయేలో చేరుతుంది అన్నారు. అందుకు కారణాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయని.. సీబీఐ ఆయనపై విచారణ జరుపుతోందని... దాంతో ఆ కేసుల నుంచి బయటపడేందుకు కేసీఆర్ బీజేపీతో అంటకాగేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అంతేకాదు, కవితకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని పాల్వాయి అంటున్నారు. తెలంగాణ ఇస్తే టీఆరెస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తానని చెప్పిన టీఆరెస్ ఇప్పుడు కాంగ్రెస్ ను పూర్తిగా మరిచిపోయి బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధమవుతున్నారని పాల్వాయి ఆరోపించారు.

అయితే.. బీజేపీ ఇంతకాలం టీఆరెస్ ను దూరంగా ఉంచినా మొన్న బీహార్ ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీ ధోరణి కూడా మారింది. వచ్చే ఏ పార్టీనీ వదులుకోరాదన్న ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో ఎన్డీయేలోకి టీఆరెస్ ప్రవేశానికి ఓకే చెప్తుతుందని భావిస్తున్నారు. పైగా... చంద్రబాబు - కేసీఆర్ లు కూడా స్నేహంగా ఉండడంతో టీఆరెస్, టీడీపీ రెండూ ఎన్డీయేలో ఉన్నా ఇబ్బంది లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో టీఆరెస్ సంక్రాంతి తరువాత ఎన్డీఏలో చేరుతుందని భావిస్తున్నారు.