Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం నిధుల‌పై తెలంగాణ ఎంపీ అడ్డుపుల్ల‌

By:  Tupaki Desk   |   18 March 2017 4:49 AM GMT
పోల‌వ‌రం నిధుల‌పై తెలంగాణ ఎంపీ అడ్డుపుల్ల‌
X
ఏపీ ప్ర‌త్యేక‌ ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ - పోలవరం ప్రాజెక్టుకు రుణం మంజూరు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే పోల‌వ‌రం రుణం విష‌యంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే తెలంగాణ‌ కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. ఇదే విష‌యంపై రాజ్యసభలో సావధాన తీర్మానం రూపంలో ప్ర‌స్తావించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించకున్నా నాబార్డ్ నుండి రుణ సౌకర్యం ఎలా కల్పిస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వాన్ని పాల్వాయి సూటిగా ప్రశ్నించారు. నాబార్డ్ వ్యవసాయ - నీటిపారుదల పథకాలకు రుణ సహాయం చేయాలని, అయితే అన్ని అనుమతుల లభించిన నీటి పారుదల పథకాలకు మాత్రమే నాబార్డ్ రుణాలు మజూరు చేయాలనే నిబంధనను కేంద్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు పర్యావరణ అనుమతి లభించలేదని, ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? అని ఆయన నిలదీశారు.

పర్యావరణ అనుమతి లభించకపోతే రాష్ట్ర ప్రాజెక్టు అయినా, జాతీయ ప్రాజెక్టు అయినా నాబార్డ్ రుణం మంజూరు చేయకూడదని పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వేలాది కోట్ల రుణం మంజూరు చేయటం ద్వారా నాబార్డ్ నియమ, నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను రద్దు చేయటంతోపాటు పని నిలిపివేయాలనే ఆదేశాలు జారీ చేశాయన్నారు. కేంద్ర పర్యావరణం, ఆటవీ శాఖలు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశిస్తే నాబార్డ్ మాత్రం వేలాది కోట్ల రుణాలు మంజూరు చేయటం విచిత్రంగా ఉన్నదన్నారు. ఇది చట్ట విరుద్ధమని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అన్ని అనుమతులు లభించటంతోపాటు నిర్వాసితులైన ఆఖరు గిరిజనుడి ప్రయోజనాలను కాపాడిన తరువాతనే పోలవరం ప్రాజక్టు నిర్మాణం చేపట్టాలని, అంతవరకు నిధులు విడుదల చేయకూడదని పాల్వాయి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను మొదట పరిష్కరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ రుణాలు విడుదల కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పాల్వాయి కేంద్ర జల వనరుల శాఖను కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/