Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కేటీఆర్?

By:  Tupaki Desk   |   10 July 2016 7:55 AM GMT
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కేటీఆర్?
X
కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ తన స్థానంలో కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆయన అంటున్నారు. కేసీఆర్ మరో ఆరు నెలల్లో రాజీనామా చేసి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించనున్నారని పాల్వాయి గోవర్దనరెడ్డి చెప్పారు. అంతేకాదు.. కేటీఆర్ ను సీఎం చేశాక.. ఏడాది పాటు ఆయనకు అవకాశం ఇచ్చి ఆ తరువాత ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తారని కూడా పాల్వాయి జోష్యం చెప్పారు. ఏడాది ముందుగా టీఆరెస్ ఎన్నికలకు వెళ్లబోతోందని ఆయన అన్నారు.

2019 వరకూ సీఎంగా ఉండి ఎన్నికలకు వెళితే, ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత గెలుపోటములను ప్రభావితం చేస్తుందన్న కారణంతోనే కేసీఆర్, తన కుమారుడిని సీఎం పదవిపై కూర్చోబెట్టాలని అనుకుంటున్నారని, ఈ విషయంపై టీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోందని పాల్వాయి తెలిపారు. కేవలం ప్రచారం కోసమే హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారని ఆయన విమర్శించారు. కాగా పాల్వాయి వ్యాఖ్యలను టీఆరెస్ వర్గాలు ఖండిస్తున్నాయి.

అయితే.. తెలంగాణలోని పలువురు ఇతర పార్టీల నేతలు మాత్రం పాల్వాయి చెప్పింది 100 శాతం నిజమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కేసీఆర్ పట్ల ప్రజలకు ఉన్న మోజు క్రమంగా తగ్గుతోందని.. పైగా ఆయన కూడా విశ్రాంతి కోరుకుంటూ ఫాం హౌస్ కు పరిమితం అవుతున్నారని.. ఆ నేపథ్యంలో ఆఫీసులో లేని సీఎం పట్ల వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. కాబట్టే... కేసీఆర్ సీఎం పదవిని కొడుక్కి అప్పగించి ఫాంహౌస్ లో కూర్చుని రాజకీయ వ్యూహాలు రచిస్తారని అంటున్నారు. చివర్లో తమకు అలవాటైన మంత్రం సెంటిమెంటును రగిలించి ఎన్నికలకు ముందుగానే వెళ్తారని అంటున్నారు. కాగా సుదీర్ఘకాలం తెలంగాణ కోసం పోరాడి ఇప్పుడు సీఎం అయిన తరువాత కేసీఆర్ కేవలం రెండున్నరేళ్ల అధికారంతోనే సంతృప్తి చెందుతారా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మరి పాల్వాయి జోష్యం నిజమవుతుందో లేదో చూడాలి.