Begin typing your search above and press return to search.

ఆధార్ లింక్ చేయ‌కుంటే పాన్ చెల్ల‌దిక‌

By:  Tupaki Desk   |   25 March 2017 4:25 AM GMT
ఆధార్ లింక్ చేయ‌కుంటే పాన్ చెల్ల‌దిక‌
X
అన్ని రకాల సేవలకు ఆధార్‌ ను అనుసంధానం చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు పాన్‌ కార్డుతోనూ దీనికి ముడిపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పాన్‌ కార్డును ఆధార్‌ తో అనుసంధానం చేయాలని, లేనిపక్షంలో పాన్ చెల్లదని స్పష్టం చేసింది. ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలుకు పాన్‌ ను ముడిపెట్టిన కేంద్రం ఇప్పుడు దానికి గడువునూ విధించడం గమనార్హం. తాత్కాలికంగా ఈ గడువును డిసెంబర్ 31గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే పాన్ కార్డు ఉన్న వ్యక్తులు దాన్ని ఆధార్‌ తో అనుసంధానం చేసుకోవాలి లేదా ఆధార్‌కు దరఖాస్తు చేసుకున్నట్టుగా ఆధారాలు చూపించాలని అధికార వర్గాల్ని ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.

ప్రతి వ్యక్తికి ఉండే 12 అంకెల ఆధార్ సంఖ్యను విస్తృతంగా ఉపయోగంలోకి తేవాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా పాన్ కార్డుకు సైతం దీన్ని తప్పనిసరి చేస్తున్నది. కొంతమంది అక్రమంగా పాన్ సంఖ్యను పొందుతున్నారని గుర్తించిన కేంద్రం ఆధార్‌ తో అనుసంధానం చేయడం ద్వారా దానికి అడ్డుకట్టవేయాలని భావిస్తున్నది. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ లోక్‌ సభ ఓ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఆధార్ సంఖ్య లేదా ఆధార్ కోసం దరఖాస్తు చేసిన రసీదు లేకుండా జులై 1 నుంచి పన్ను చెల్లించే అవకాశం ఉండదు. మ‌రోవైపు ఇకనుంచి పాన్ - ఓటర్ గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డే ఎవరికైనా ఏకైక గుర్తింపు కాబోతున్నదన్నమాట. ఇప్పటికే ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌ సభలో విస్పష్టంగా తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/