Begin typing your search above and press return to search.

టెన్ష‌న్ వ‌ద్దు.. ఆ పాన్‌ కార్డులు ర‌ద్దు కావు

By:  Tupaki Desk   |   30 Jun 2017 9:50 AM GMT
టెన్ష‌న్ వ‌ద్దు.. ఆ పాన్‌ కార్డులు ర‌ద్దు కావు
X
చాలామందికి ఇప్పుడో పెద్ద దిగులుగా మారింది. ఓప‌క్క జీఎస్టీ.. మ‌రోప‌క్క పాన్ కార్డుల‌తో ఆధార్‌ కార్డుల అనుసంధానం. ఈ రెండు ఒకే టైంలో షురూ కానుండ‌టంతో ఎవ‌రి ఆందోళ‌న‌లో వారు ఉన్నారు. పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోని వారంతా రేప‌టి నుంచి వారి పాన్ కార్డులు ర‌ద్దు అవుతాయ‌న్న అభిప్రాయం ప‌లువురిలో నెల‌కొంది. దీంతో.. పాన్ కార్డులు చెల్లుబాటు ర‌ద్దు అయితే ఇంకేమైనా ఉందా? అని టెన్ష‌న్ ప‌డిపోతున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది.

పాన్ కార్డు ర‌ద్దు కాకుండా ఉండేందుకు ఆధార్ తో అనుసంధానం చేసుకోవాల‌న్న ఆదేశాల్ని కేంద్రం జారీ చేసింది. ఇందుకు తుది గ‌డువుగా జూన్ 30ను పెట్టింది. గ‌డువు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ అనుసంధానం చేసుకునే వారిసంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోయింది. దీంతో త‌మ పాన్ కార్డుల్ని ఆధార్ తో అనుసంధానం చేస‌కోవ‌టం కోసం ఇన్ క‌మ్‌ ట్యాక్స్ వెబ్ సైట్‌ ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో స‌ర్వ‌ర్ మీద భారం పెరిగిపోవ‌టంతో సైట్ డౌన్ అయ్యింది. దీంతో.. ఎవ‌రూ త‌మ కార్డుల్ని అనుసంధానం చేసుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌ల్ని త‌గ్గించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఎవ‌రూ భ‌య‌ప‌డొద్ద‌ని.. జూన్ 30 త‌ర్వాత కూడా ఆధార్ తో పాన్ కార్డులు అనుసంధానం చేసుకోవ‌చ్చ‌ని.. ఒక‌వేళ అనుసంధానం చేసుకోకున్నా చెల్లుబాటులోఎలాంటి ఇబ్బంది ఉండ‌దంటూ సీబీడీటీ ఛైర్మ‌న్ సుశీల్ చంద్ర స్ప‌ష్టం చేశారు. ఆ మ‌ధ్య‌న ఆదాయ‌ప‌న్ను విభాగం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం జులై 1 నుంచి ప్ర‌తి వ్య‌క్తి ఆధార్ నెంబ‌ర్‌ ను త‌ప్ప‌నిస‌రిగా పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల‌ని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐటీ చ‌ట్టంలోని 114వ నిబంధ‌న‌ల్లో ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేశారు. తాజాగా జారీ అయిన ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌స్తుతానికి ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం కాకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/