Begin typing your search above and press return to search.

విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆయనేనా...?

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:30 AM GMT
విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆయనేనా...?
X
వైసీపీకి విశాఖ ఎంపీ సీటు చాలా ముఖ్యం. 2014 ఎన్నికల్లో తొలిసారిగా వైసీపీ పోటీ చేసింది. ఆనాడు. జగన్ తల్లి విజయమ్మ ఎంపీ అభ్యర్ధిగా ఉన్నారు. అయితే ఆమెను లక్ష ఓట్ల తేడాతో బీజేపీ టీడీపీ కూటమి ఓడించేసింది. ఆ తరువాత పట్టుదల పట్టి మరీ 2019 నాటికి పరిస్థితిని తనకు అనుకూలంగా వైసీపీ మార్చుకుంది. దానికి జనసేన పోటీ చేయడం కూడా కలసివచ్చింది. అలా త్రిముఖ పోటీ జరిగి వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ నాలుగువేల స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఈసారి ఆయనకు కచ్చితంగా టికెట్ దక్కదనే అంటున్నారు. ఆయన కూడా అలాంటి ఆశలు పెట్టుకోవడంలేదు అని చెబుతున్నారు. ఆయన తనకు ఎమ్మెల్యే సీటు కావాలని కోరుకుంటున్నారు. సరే ఆయన సంగతి అలా ఉంచితే వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అన్నది మాత్రం చర్చగానే ఉంది. టీడీపీకి ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అలాగే బీజేపీ కూడా ఈ సీటు మీద కన్నేసింది. జనసేన గత ఎన్నికల్లో రెండు లక్షల ఎనభై వేల ఓట్లను గెలుచుకుంది కాబట్టి ఈసారి పోటీకి సై అంటోంది.

ఇలా విపక్ష శిబిరం నుంచి గట్టి పోటీయే ఉంటుంది. అంతే కాదు పొత్తులు కనుక కుదిరితే దానిని సైతం తట్టుకుని గెలవాలీ అంటే ధీటైన అభ్యర్ధి ఉండాలి. అలాగే సామాజికవరం పరంగా బలంగా ఉండాలి. ఇలా అంగబలం, అర్ధబలం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ వైసీపీ కొత్త ప్రెసిడెంట్ గా పంచకర్ల రమేష్ బాబుని ఎంపిక చేసింది అధినాయకత్వం. దాంతో ఆయన పేరు ఇపుడు ఎంపీ అభ్యర్ధిగా గట్టిగా వినిపిస్తోంది.

ఆయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు. పైగా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్నారు. వివాదరహితుడు కూడా. దాంతో ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అటు ఎంపీ సీటుని గెలుచుకోవడంతో పాటు ఇటు ఎమ్మెల్యే సీట్లను కూడా ఎక్కువగా గెలుచుకునే వీలు ఉంటుందని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ నియోజకవర్గం పరిధిలో కాపుల సంఖ్య ఎక్కువగా ఉంది.

దాంతో ఆ వర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిని ఎంపిక చేయడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు అన్న అంచనాలతోనే వైసీపీ వ్యూహాత్మకంగా ఆయనను విశాఖ ప్రెసిడెంట్ గా నియమించింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే పంచకర్ల రమేష్ బాబు అసెంబ్లీ టికెట్ ని ఆశిస్తున్నారు. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే అధినాయకత్వం ఇష్టం కూడా ఉంటుంది కాబట్టి పంచకర్లని సెలెక్ట్ చేయాలనుకుంటోంది అని అంటున్నారు. ఆయనను మించిన క్యాండిడేట్ కూడా వైసీపీకి విశాఖ పరిధిలో లేరు అని చెబుతున్నారు. మొత్తానికి పంచకర్లను ఎంపీగా వైసీపీ నిలబెడితే మాత్రం విపక్షాలకు గట్టి సవాల్ గానే ఈ ఎన్నిక ఉంటుంది అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.