Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సీఎం కుర్చీ పై ఈ న‌లుగురికి క‌న్నుంద‌ట‌!

By:  Tupaki Desk   |   28 Jan 2020 1:51 PM GMT
జ‌గ‌న్ సీఎం కుర్చీ పై ఈ న‌లుగురికి క‌న్నుంద‌ట‌!
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌ల కేసుల‌ విష‌యంలో ఒకింత ఇబ్బందిని ఎదుర్కుంటున్న సంగ‌తి తెలిసిందే. కోర్టుకు హాజ‌రు విష‌యంలో ఆయ‌న మిన‌హాయింపులు కోరుకోవ‌డం...ఈ విష‌యంలో కోర్టులో ఆయ‌న‌కు చుక్కెదురు అవ‌డం...తెలిసిన విష‌య‌మే. అయితే, ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని పేర్కొంది. అంతేకాకుండా... ఆయ‌న ముఖ్య‌మంత్రి కుర్చీపై న‌లుగురు నేత‌లు క‌న్నెశార‌ని ఆరోపించింది.

తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ - అసెంబ్లీ సాక్షిగా 5కోట్ల మంది ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మండలి రద్దుపై చ‌ర్చ అనంత‌రం ఓటింగ్ స‌మ‌యంలో అసెంబ్లీలో 121మంది హాజరైతే 133మంది అని స్పీకర్‌ కి తప్పుడు లెక్కలు ఇచ్చారు. ఇలా త‌ప్పుడు లెక్కల వలనే జగన్ మోహన్‌ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. అదే తప్పుడు లెక్కల అల‌వాటును అసెంబ్లీలో కూడా చేశారని ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఖచ్చితంగా జైలుకు వెళ్తారని నిపుణులు చెబుతున్నారని పంచుమ‌ర్తి అనురాధ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత అనుచ‌రురాలు శశికళ కేవలం రూ.66 కోట్లకే జైలుకు వెళ్లింది. అలాంటి జ‌గ‌న్ అక్ర‌మాల విష‌యంలో ఇప్పటికే సీబీఐ రూ.43వేల కోట్లను జప్తు చేసింది. జగన్ మోహన్‌ రెడ్డిపై ఇంకా అనేక కేసులు ఉన్నాయి. అందుకే మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌ - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యే రోజారెడ్డికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కాబట్టి వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు`` అని ఆరోపించారు. బొత్స సత్యనారాయణ గతంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరిక ఉందని అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే రేసులో ఉండాలనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషిస్తున్నారని చెప్పుకొచ్చారు.