సబ్సిడీ వద్దు కానీ వేల కోట్ల మాఫీ కావాలి
By: Tupaki Desk | 7 Aug 2015 6:49 AM GMTమన రాజకీయ నాయకులు మహా ముదుర్లు. చెప్పే నీతి మాటలకు చేసే తప్పుడు పనులకు ఏ మాత్రం పోలిక ఉండదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ శ్రీరామ చంద్రుళ్ల మాదిరి ఫోజులు కొట్టి.. నీతి సందేశాలిచ్చే నాయకుల అసలు రూపం ఉదంతమిది.
ఒడిశాకు చెందిన బీజేడీ ఎంపీ బైజయంతి పాండా ఈ మధ్య వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే.. పార్లమెంటు క్యాంటీన్ లో సబ్సిడీ మీద కారుచౌకగా ఇచ్చే ఆహార పదార్థాలు ఎంపీలకు ఇవ్వనక్కర్లేదంటూ తన నిర్ణయాన్ని ప్రకటించి అందరి నోళ్లల్లో నానారు. ఆహా.. ఎంత మంచి మనసు. ప్రజాధనం ఏ మాత్రం వేస్ట్ కాకూడదని ఎంత తపన అని.. ఆయన గురించి పూర్తిగా తెలీనోళ్లు తెగ సంతోష పడిపోయారు.
కానీ.. అయ్యగారి భాగోతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎంపీ పాండాగారి కుటుంబ సభ్యులు నిర్వహించే ఇండియన్ ఛార్జి క్రోమ్ లిమిటెడ్ కంపెనీకి ఐడీబీఐ బ్యాంకు నుంచి అక్షరాల రూ.2,300 కోట్లు రుణమాఫీ వచ్చిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఐడీబీఐ బ్యాంకుకు ఉన్న నిరర్ధక ఆస్తుల్లో పాండా సంస్థకు ఇచ్చిన మినహాయింపే 16.5 శాతం వరకూ ఉంటుందని లెక్క తేల్చారు.
ఇదొక్క ఉదంతమే కాదు.. అయ్యగారి కుటుంబానికే చెందిన ‘‘ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లాయ్స్ ఇప్పటికే 20 బ్యాంకులకు అప్పులు ఎగగొట్టిన వారి జాబితాలో పేరుందని చెబుతున్నారు. చపాతీ మీదిచ్చే రూ.10.. బిర్యానీ మీదిచ్చే రూ.వంద రాయితీ వద్దని చెప్పే పెద్దమనిషి.. ఒక్క బ్యాంకే ఏకంగా రూ.2300కోట్లు పంగనామాలు పెట్టారా? అని తెలిసిన నోట మాట రాకుండా అవాక్కు అవుతున్న పరిస్థితి. మరి.. ఈ రుణఎగవేత మీద కూడా ఎంపీగారు పెద్ద మనసుతో స్పందించేంత దమ్ము ఉందా? అని ఆవేశంగా ప్రశ్నిస్తున్న వాళ్లున్నారు.