Begin typing your search above and press return to search.

చలికాలం కరోనాతో మరింత వినాశనం తప్పదా.. ప్రాణాంతకంగా మారనున్న వైరస్

By:  Tupaki Desk   |   17 Aug 2020 11:30 PM GMT
చలికాలం కరోనాతో మరింత వినాశనం తప్పదా.. ప్రాణాంతకంగా మారనున్న వైరస్
X
దేశంలో మొదటి దఫా కరోనానే ఇప్పటికీ సద్దుమణగలేదు. రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే చలికాలం.. కరోనా రెండో దఫా వైరస్ ప్రబలే అవకాశం ఉందని, అది ఈసారి మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉండడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం మామూలుగానే ఫ్లూ వంటి వైరస్లు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంటాయి. ప్రతి ఇంటా పిల్లలు, పెద్దలు జలుబు బారిన పడుతుంటారు. అదే ఇప్పుడు ఆందోళన పరుస్తోంది. కరోనా కూడా అలాగే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తే పరిస్థితి ఏంటని అంటున్నారు. అందుకే ఈసారి రాబోయే చలికాలం అంటే అందరూ జడుసుకుంటున్నారు. కరోనా వైరస్ మిగతా సమయం కంటే చలికాలం దాని వ్యాప్తి పెరుగుతుందని కొలంబియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మికేలా మార్టీనేజ్ అంటున్నారు.

చలికాలం వైరస్ లు జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతున్నారు. చలికాలం మొదలయ్యే కరోనా సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య మరింత పెరగనుందని బ్రిటన్ ప్రభుత్వం ఓ నివేదికలో పేర్కొంది. చాలా దేశాల్లో మొదటి దఫా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. దాని తీవ్రతను అంచనా వేయలేకపోయాయి. అయితే రెండో దఫా కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉందని తెలిసి కూడా చాలా ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సన్నద్ధత కాలేదు. కొత్తగా ఆసుపత్రుల నిర్మాణం, వైద్య సిబ్బందిని పెంచుకోవడంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. అందుకే ఈసారి చలికాలం కరోనా మరింత ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.