Begin typing your search above and press return to search.

మహమ్మారి ఎఫెక్ట్.. పార్లమెంటు సమావేశాలు ఇకపై అలానా?

By:  Tupaki Desk   |   10 Jun 2020 5:30 AM GMT
మహమ్మారి ఎఫెక్ట్.. పార్లమెంటు సమావేశాలు ఇకపై అలానా?
X
యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహమ్మారి.. ఇప్పుడిప్పుడే వదిలి వెళ్లే అవకాశం లేకపోవటం.. దాని విస్తరణకు చెక్ చెప్పేందుకు అవసరమైనన్ని మార్గాల్ని అన్వేషించాల్సిన పరిస్థితి. ఇందులో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని నెలల పాటు ఈ మహమ్మారితో కలిసి జీవించాల్సిన నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ సాధ్యమయ్యేలా లేదని చెబుతున్నారు. వర్షాకాల సమావేశాల్ని ఎలా నిర్వహించాలన్న అంశంపై లోక్ సభ స్పీకర్.. రాజ్యసభ ఛైర్మన్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సభ్యుడికి.. ఒక సభ్యుడికి మధ్య దూరం కనీసం ఒక మీటరుకు తగ్గించినా.. అందరూ కూర్చునే వెసులుబాటుపార్లమెంటులో లేదు. విజిటర్స్ గ్యాలరీని కూడా సభ్యులకే కేటాయించినా సరిపోని పరిస్థితి.

ఒక అంచనా ప్రకారం.. ఇప్పటి నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. లోక్ సభ సెంట్రల్ హాల్ లో వంద మంది కూర్చునే వీలుందంటున్నారు. రాజ్యసభలోనూ అరవైకి మించిన అవకాశం ఉండదని తేల్చారు. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు ఎలా నిర్వహించాలన్నది క్వశ్చన్. ఈ సమస్యకు రెండు మార్గాల్ని ప్రస్తావిస్తున్నారు. అందులో ఒకటి.. పార్లమెంటు సమావేశాల్ని వర్చువల్ లో నిర్వహించటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు ఈ విధానంలో ఆన్ లైన్ లో అందరితో మాట్లాడేలా చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

అదే సమయంలో.. కొందరు ఎంపీల్ని సభకు అనుమతించటం.. మిగిలిన వారిని ఆన్ లైన్ లో కనెక్టు అయ్యేలా చేయటం. ఎవరి అవసరం ఉందో వారికి అనుమతి ఇవ్వటం ద్వారా.. ప్రజాసమస్యలపైన చర్చించే వీలుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉభయ సభల సభ్యుల్ని ఢిల్లీకి పిలిపించి.. సభల్నినిర్వహించటం ఏ మాత్రం క్షేమకరం కాకపోవటంతో.. వర్చువల్ పద్దతికే ఓటు వేసే అవకాశం ఉందని చెప్పక తప్పదు.