Begin typing your search above and press return to search.

తెలంగాణకు బ్రిటన్ నుంచి 16మంది.. వైరస్ అడ్డుకట్టకు 3టీ విధానం

By:  Tupaki Desk   |   25 Dec 2020 5:30 PM GMT
తెలంగాణకు బ్రిటన్ నుంచి 16మంది.. వైరస్ అడ్డుకట్టకు 3టీ విధానం
X
బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఈ కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఆందోళన దేశంలోనూ మొదలైంది. తెలంగాణకు కూడా బ్రిటన్ నుంచి 16మంది వచ్చినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టింది.

యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 1200 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16మందిని గుర్తించి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు , జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్ జిల్లా ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి.

16మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 16మందికి 76మంది అతి సన్నిహితంగా ఉన్నారని గుర్తించారు. 16 మందిలో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి సీసీఎంబీకి పంపించామని.. మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చిన వారు లేదా యూకే గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్స్‌ఆప్ ద్వారా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని. సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.