Begin typing your search above and press return to search.
ఆస్పత్రి నిర్వాకం...బతికున్న కరోనా పేషెంట్ ను చంపేశారు
By: Tupaki Desk | 24 Nov 2020 1:30 AM GMTఆసుపత్రుల్లో ఒక తల్లి కన్నబిడ్డను మరో తల్లికి పొరపాటున ఇవ్వడం...ఒక పేషెంట్ కు బ్లడ్ క్యాన్సర్ అన్న రిపోర్ట్ ను లక్షణంగా ఉన్న పేషెంట్ కు ఇచ్చి నాలుక కరుచుకోవడం...వంటి సన్నివేశాలు అనేక సినిమాల్లో చూసుంటాం. అయితే, తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఇదే తరహాలో సినీ ఫక్కీలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ ఆసుపత్రిలో చనిపోయిన ఓ పేషెంట్ శవాన్ని మరో పేషెంట్ కుటుంబ సభ్యులకు అప్పగించిందో ఆసుపత్రి. ఆ శవం తమదే అనుకొని సదరు కుటుంబం అంత్యక్రియలు నిర్వహించిన వారానికి ఆసుపత్రి యాజమాన్యం తప్పు జరిగిందని గుర్తించి నాలుక కరుచుకుంది. అసలు విషయం బయటకు రావడంతో ఇరు కుటుంబాల వారు ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 4వ తేదీన శిబ్దాస్ బెనర్జీ(75) అనే వృద్ధుడు బెంగాల్ లోని బలరాంపూర్ బసు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. అదే రోజున మోహినిమోహన్ ముఖర్జీ(75) అనే వ్యక్తి కూడా కరోనా బారిన పడి అదే ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 13న బెనర్జీ చనిపోయారంటూ ఆయన కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారమిచ్చారు. కరోనాతో మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రొటెక్టివ్ మెటిరియల్‌తో కప్పి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, వారం రోజుల తర్వాత బెనర్జీ బ్రతికే ఉన్నారంటూ బెనర్జీ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. పొరపాటున ముఖర్జీ మృతదేహాన్ని అప్పగించామని బెనర్జీ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ కుటుంబ సభ్యులకు. ... బెనర్జీ బతికే ఉన్నారన్న ఆనందం....ఆసుపత్రి చేసిన నిర్వాకానికి కోపం....రెండూ ఒకేసారి వచ్చాయి. దీంతో, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు. అయితే, ముఖర్జీని చికిత్స కోసం బర్సాత్‌కు తరలించామని, ఆ సమయంలో ముఖర్జీకి బదులు బెనర్జీ మెడికల్ రిపోర్టును ఇవ్వడంతో ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి డీన్ వివరణ ఇచ్చారు. బర్సాత్ లో చికిత్స పొందుతున్న ముఖర్జీ చనిపోయారని, మారిన రిపోర్ట్ లో బెనర్జీ అడ్రస్ ఉండడంతో బెనర్జీ కుటుంబ సభ్యులకు ముఖర్జీ శవాన్ని అప్పగించామని తెలిపారు.