Begin typing your search above and press return to search.

కరోనా : డేంజర్ జోన్ లో తెలంగాణ జిల్లాలు !

By:  Tupaki Desk   |   18 July 2020 9:10 AM GMT
కరోనా : డేంజర్ జోన్ లో తెలంగాణ జిల్లాలు !
X
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి మరింత ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా మహమ్మారి ముప్పు చాలా ఎక్కువగా ఉందని , ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఫెసిలిటీలు మెరుగవ్వకపోతే కేసులు, మరణాల రేటు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని , ఈ విషయాన్ని దేశంలో 9 పెద్ద రాష్ట్రాల్లో తాము జరిపిన స్టడీలో ఈ విషయాలను అంచనా వేసినట్లు ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ కు చెందిన సైంటిస్ట్ రాజీబ్ ఆచార్య వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఈ స్టడీ వివరాలు వెల్లడైయ్యాయి.

ఈ అంచనా ప్రకారం .. కరోనా వైరస్ బారిన పడే రాష్ట్రాల్లో ఎక్కువగా మధ్యప్రదేశ్‌ కు అవకాశం ఉండగా ఆ తర్వాత బీహార్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లో సోషియోఎకనమిక్, డెమోగ్రాఫిక్, హౌసింగ్, హైజీన్, ఎపీడెమియోలజికల్, హెల్త్ సిస్టం అనే ఐదు రంగాల్లో 15 ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్టడీ జరిపారు. ఆయా రాష్ట్రాలకు జీరో నుంచి 1 వరకు స్కోరును కేటాయించగా .. మధ్యప్రదేశ్ అత్యధికంగా 1 స్కోరును పొందింది. దేశంలోనే మధ్యప్రదేశ్ లోని జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత తెలంగాణ, బీహార్ జిల్లాలకు ముప్పు అధికంగా ఉందని స్టడీలో తేలింది.

ప్రస్తుతం భారత్‌లో చాలా జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో లేదని కాని భవిష్యత్తులో మాత్రం ఇవి కూడా ఈ మహమ్మారి బారిన పడతాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ ‌కు సున్నా నుంచి 1 స్కేలింగ్‌ పై 1 రాగా సిక్కింకు 0 స్కేలింగ్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. మొత్తంగా కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న 100 జిల్లాల్లో యూపీలో 33, బీహార్ లో 24, మధ్యప్రదేశ్ లో 20 జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని రీసెర్చర్లు హెచ్చరించారు. దేశంలో కొత్త రాష్ట్రం తెలంగాణ మాత్రం కరోనా బారిన పడే రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. జూలై 1 నుంచి తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాన్సెట్ నివేదిక రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలో కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుందని లాన్సెట్ స్టడీ హెచ్చరించింది. అయితే, గత కొన్ని రోజులుగా హైదరాబాదులో కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే మళ్లీ పెరిగే అవకాశం ఉందని , ఈ స్టడీ వెల్లడిస్తోంది. అలాగే, హైదరాబాద్ నుండి కరోనా భయంతో చాలామంది సొంత గ్రామాలకు పోవడంతో అక్కడ కరోనా వైరస్ కేసులు తగ్గి ఉండొచ్చనే అభిప్రాయం కూడా కొంతమంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.