Begin typing your search above and press return to search.

700 మంది తాలిబన్లు హతం..పంజ్‌షీర్ సైన్యం కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   6 Sep 2021 5:38 AM GMT
700 మంది తాలిబన్లు హతం..పంజ్‌షీర్ సైన్యం  కీలక  ప్రకటన
X
ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వచ్చేసింది. ఒక్క పంజ్‌ షీర్ తప్ప. పంజ్‌ షీర్ లోయపై పట్టుసాధించామని తాలిబన్లు చేసిన ప్రకటనలో నిజం లేదని తెలుస్తోంది. పంజ్‌ షీర్ సైన్యం, తాలిబన్ ఫైటర్ల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఎట్టిపరిస్థితుల్లో తాలి బన్ మూకలకు లొంగిపోయే ప్రసక్తేలేదని స్థానిక నేత అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలోని నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. ఇదే సమయంలో తాలిబన్లకు పంజ్‌ షేర్‌ లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. తాలిబన్‌‌ కు చెందిన 700 ఫైటర్లను హతమార్చినట్లు నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ తెలిపింది.

పంజ్‌ షీర్‌ లోని పలు జిల్లాల్లో తాలిబన్లు, స్థానిక బలగాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రాజధాని బజారక్‌ లోకి ప్రవేశించి గవర్నర్‌ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్ుట తాలిబన్‌ అధికార ప్రతినిధి బిలాల్‌ కరీమీ ప్రకటించారు. మొత్తం ఎనిమిది జిల్లాల్లో నాలుగు తమ వశమయ్యాయని తెలిపారు. పంజ్‌ షీర్‌ లో పోరాటం కొనసాగుతోంద తాలిబన్‌‌ కు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే బజారక్‌ రోడ్లు, గవర్నర్‌ కార్యాలయం ఆవరణలో స్థానిక సైన్యం మందుపాతరలు అమర్చాయని చెప్పారు. ఫలితంగా తమ ఆక్రమణ వేగం తగ్గిందన్నారు. పంజ్‌షీర్‌లో తమ పట్టు సడల్లేదని ఎన్‌ ఆర్‌ ఎఫ్‌ బలగాలు స్పష్టం చేశాయి.

ప్రావిన్సు వ్యాప్తంగా జరిగిన పోరాటంలో 700 మందికి పైగా తాలిబన్‌ సభ్యులను మట్టుబెట్టామని, అలాగే మరో 1,000 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నాయి. దష్తె రెవాక్‌ ప్రాంతంలో తమ బలగాలు చుట్టుముట్టడంతో వందల మంది తాలిబన్లు వాహనాలను వదిలి పారిపోయారని తెలిపారు. పర్యాన్‌ జిల్లాలో చెలరేగిన తీవ్రస్థాయి ఘర్షణ శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిందని వెల్లడించాయి. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని అఫ్గన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ వారితో పోరాటంలో తాను గాయపడితే, తన తలలో రెండుసార్లు కాల్పులు జరపాలని ఓ సైన్యాధికారికి సూచించినట్లు తెలిపారు.

బ్రిటన్‌ కు చెందిన డెయిలీ మెయిల్ ప్రత్రిక తాజాగా రాసిన వ్యాసంలో సలేహ్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. అఫ్గాన్‌ తాలిబన్ల వశమవ్వడానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. మరోవైపు, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. తాలిబన్ మిత్రపక్షాల మధ్య శుక్రవారం రాత్రి ఈ అంశంపై వివాదం మొదలై ఘర్షణకు దారితీసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో బరాదర్‌ గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆయనకు సంబంధించిన పాక్ పాస్‌ పోర్ట్ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.