Begin typing your search above and press return to search.

కరవు నేలలో పంకజా ముండే సెల్ఫీ గోల

By:  Tupaki Desk   |   18 April 2016 3:15 PM IST
కరవు నేలలో పంకజా ముండే సెల్ఫీ గోల
X
వేళ కాని వేళలో చేసే పనుల కారణంగా అడ్డంగా బుక్ అవుతామన్న ఆలోచన లేని నేతలు పాలకులు కావటానికి మించిన దురదృష్టకరం ఏముంటుంది? ట్రెండ్ గా మారిన సెల్ఫీతో అడ్డంగా బుక్ అయిన మంత్రిగారి ఉదంతమిది. కరవుతో నానా కష్టాలు పడుతున్న మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఎండిపోయిన ఒక నది దగ్గర సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కరవు రక్కసిలో కూరుకుపోయిన లాతూర్ జిల్లా బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న పంకజా ముండే తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కరవుతో జనాలు పడరాని పాట్లు పడుతుంటే.. ఇలా సెల్ఫీలు దిగుతారా? అంటూ జనాలు తిట్ల దండకం అందుకున్న పరిస్థితి. తాను తీసుకున్న సెల్ఫీ తనకిలా షాకిస్తుందని ఏమాత్రం ఊహించని పంకజా తాజా పరిణామంతో కంగుతిన్నారు.

సోషల్ మీడియాలో తన మీద వెల్లువెత్తుతున్న విమర్శల్ని తగ్గించుకునే క్రమంలో ఆమె నష్టనివారణ చర్యలు మొదలెట్టారు. తాను మంజీరా నది పునరుద్ధరణ పనులు సమీక్షించటానికి వెళ్లానని.. అక్కడ పనులు వేగంగా జరుగుతున్న తీరును తెలియ జెప్పేందుకు సెల్ఫీని తీసుకున్నట్లు చెప్పారు. పంకజా వివరణ సంతృప్తికరంగా లేదన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. టైం కాని టైంలో సెల్ఫీ దిగి పంకజా అడ్డంగా బుక్ అయ్యారనే చెప్పాలి.