Begin typing your search above and press return to search.

నిజంగానే.. పన్నీరును అమ్మ అంతలా పొగిడేశారు

By:  Tupaki Desk   |   8 March 2017 5:18 PM GMT
నిజంగానే.. పన్నీరును అమ్మ అంతలా పొగిడేశారు
X
మీరు చదివిన దాన్లో ఎలాంటి తప్పుల్లేవు. చనిపోయిన అమ్మ పొగడటం ఏమిటి? అన్న కన్ఫ్యూజన్ అస్సలు అక్కర్లేదు. ఇక్కడే ఉంది అసలు విషయం. అలా అని పొగిడింది దివంగత అమ్మ జయలలిత కాకుండా మరే ఇతర ‘అమ్మ’ అన్న సందేహ పడాల్సిన అవసరం లేదు. సూటిగా విషయంలోకి వెళితే.. అమ్మ మృతి మీద న్యాయ విచారణ జరిపించాలంటూ అమ్మ విధేయుడు పన్నీరు సెల్వం ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

అమ్మ విధేయుడిగా.. అమ్మ ఏం చెబితే అలా వినే వ్యక్తిగా పన్నీరు సెల్వంకు ఉన్న ట్రాక్ రికార్డు మరెవరికీ ఉండదన్న విషయం తెలిసిందే. విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. అమ్మ మృతిపై సందేహాలు వ్యక్తం చేయటం.. చిన్నమ్మపై ఒంటికాలి మీద విరుచుకుపడుతున్న వైనం తెలిసిందే. అమ్మ మరణంపై తనకున్న సందేహాల్ని తీర్చాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న ఆయన.. తన తాజా నిరసన దీక్షలో భాగంగా.. గతంలో తనను ఉద్దేశించి అమ్మ మాట్లాడిన మాటల్ని(రికార్డెడ్) మరోసారి వినిపించారు.

దీంతో.. ఒక్కసారిగా వాతావరణం ఉద్విగ్నభరితంగా మారింది. గతంలో పన్నీరు సెల్వంను ఉద్దేశించి అమ్మ చేసిన పొగడ్తల్ని ప్లే చేశారు. ఇందులో అమ్మ ఏం మాట్లాడారంటే.. ‘‘పన్నీరు సెల్వం కింది స్థాయి నుంచి మంత్రి.. సీఎం స్థాయికి వరకూ ఎదిగారు. పార్టీ కోసం ప్రజల కోసం ఎంతో నిజాయితీగా పని చేస్తారు. పన్నీరు మాదిరి రాజ్యాధికారాన్ని వదులుకునే వ్యక్తిని ఎక్కడా చూడలేదు. రామాయణంలో మాత్రమే ఇలాంటివి జరిగాయి. అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చిన అన్న రాముడికి భరతుడు రాజ్యాధికారాన్ని అప్పగించారు. ఆ విధంగా నేను తిరిగి వచ్చాక పన్నీర్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు’’ అంటూ అమ్మ బతికి ఉన్నప్పుడు తనను ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని రికార్డు ప్లే చేశారు.

ఊహించని రీతిలో అమ్మ వాయిస్ ఒక్కసారి వినిపించటంలో దీక్షకు వచ్చిన కొందరు కన్నీటి పర్యంతమైతే.. మరికొందరు అమ్మకు అనుకూలంగా శశికళ.. ఆమె కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం కనిపించింది. భావోద్వేగంతో రగిలిపోయేలా పన్నీరు వినిపించిన అమ్మ మాటలు ఆయన ఆశించిన దాని కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/