Begin typing your search above and press return to search.

సీఎం లాగా నాట‌కాలు ఆడ‌టం నా వ‌ల్ల కాదు!

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:57 AM GMT
సీఎం లాగా నాట‌కాలు ఆడ‌టం నా వ‌ల్ల కాదు!
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో నెల‌కొన్న విబేధాలు రూపం మారుతున్నాయి. సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనంత‌రం గ్రూపులుగా చీలిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి కె పళనిస్వామిపై అన్నాడీఎంకె రెబల్‌ నేత - మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాల్సిన ప‌ళ‌నిస్వామి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రెండు వర్గాలు కలిసి పనిచేసే వాతావరణాన్ని పళని శిబిరం దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. అయితే తాము ప‌ళ‌ని టీం వ‌లే వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని తేల్చిచెప్పారు.

‘రెండు వర్గాలు కలిసి పనిచేయాలన్న అభిప్రాయంతో ప్రజలూ ఏకీభవించడంలేదు. గతంలో మా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నాం’ అని ఆదివారం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రకటించారు. రెండు వర్గాలు ఐక్యమత్యంతో పనిచేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన మర్నాడే సెల్వం అధికార వర్గంపై విరుచుకుపడ్డారు. నిర్మాణాత్మంగా వ్యవహరించాల్సిందిపోయి డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి పళనిస్వామి శిబిరంపై ఆయన విమర్శలు చేశారు. అన్నాడీఎంకెలోని రెండు వర్గాలు కలిసి పనిచేయాలని ఏప్రిల్‌ లో నిర్ణయించగా పళనిస్వామి శిబిరం మాత్రం నాటకాలు ఆడుతూ వస్తోందని సెల్వం ధ్వజమెత్తారు. పళనిస్వామితో కలిసి తాము నాటకాలు ఆడబోమని మీడియాతో చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఎటువైపు ఉన్నారో త్వరలోనే తేలిపోతుందని ఆయన అన్నారు. పార్టీ ప్రధాన కేంద్రం అలాగే రెండాకుల గుర్తు ఎన్నికల కమిషన్ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని, త్వరలోనే అది పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని పన్నీర్ సెల్వం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నుంచి మంచి నిర్ణయమే వెలువడుతుందని ఆయన అన్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో ఎవర్ని బలపరచాలన్న దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా...విపక్ష డిఎంకే ఎమ్మెల్యేలు నేడు సమావేశం కానున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, అధికార అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/