Begin typing your search above and press return to search.

విధేయుడే చివరకు ‘అమ్మ’కు వారసుడు

By:  Tupaki Desk   |   6 Dec 2016 2:48 AM GMT
విధేయుడే చివరకు ‘అమ్మ’కు వారసుడు
X
అమ్మకు అత్యంత విధేయుడు వారసుడయ్యాడు. ఆమెకు నమ్మిన బంటే ఆమె తర్వాతి వ్యక్తిగా మారాడు. వరుస విజయాలతో తమిళనాడులో తిరుగులేని రాజకీయశక్తిగా మారిన అన్నాడీఎంకేకు ఆసరాగా మారాడు. అతడే.. అమ్మ మెచ్చిన పన్నీర్ సెల్వం. అమ్మ కేసుల్లో ఇరుక్కున్నా.. చట్టపరంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టలేని పరిస్థితుల్లో ఉన్నా.. అమ్మకు ప్రత్యామ్నాయంగా ఉండే ఆయన్నే.. అమ్మ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టేందుకు అన్నాడీఎంకే పార్టీ నేతలు ఓకే అనేశారు.

పార్టీలో రెండు బలమైన గ్రూపులు ఉన్నప్పటికీ.. వారి మధ్య ఎడతెగని పంచాయితీ ఉన్నా.. అమ్మ మరణించిన శోకంలో ఉన్న ఆ పార్టీ నేతలు.. తమ విభేదాల్ని బయటపెట్టుకొని ప్రజల ముందు పలుచన కాలేదు. అమ్మ లేని లోటును తెలిసేలా చేస్తే.. అమ్మ భక్తులు ఎప్పటికీ తమను క్షమించరన్న భయం కూడా పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేసిందని చెప్పాలి. అమ్మ మెచ్చిన.. అమ్మకు నచ్చిన.. అమ్మే నమ్మిన నమ్మినబంటు అమ్మ తర్వాత అమ్మ స్థానంలో ఇప్పటికే ఒకటికి రెండు మార్లు కూర్చున్న అనుభవం ఉన్న ఆయనకు.. మరోసారి సీఎం పగ్గాలు అప్పగించటం మినహా మరో మార్గం లేదని తేల్చేసింది. దీంతో.. అమ్మ మరణ వార్త అధికారికంగా వెలువడిన కాసేపటికే.. ముందుస్తుగా అనుకున్నట్లే.. గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని పూర్తి చేశారు.

అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి.. శాసనసభాపక్ష నేతగా పన్నీరు సెల్వాన్ని ఎన్నుకున్నారు. మూడు ప్రత్యేక బస్సుల్లో రాజ్ భవన్ కు వెళ్లి.. తనకున్న బలాన్ని గవర్నర్ ముందు ప్రదర్శించటం ద్వారా.. అధికార బదిలీ ప్రక్రియను ముందు అనుకున్నట్లే పూర్తి చేశారు. పొంగుకొచ్చే దు:ఖాన్ని గుండెల్లో దాచుకుంటూ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల ప్రక్రియను పూర్తి చేశారు.

అమ్మకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ.. ఆమెకు ప్రత్యామ్నాంగా పగ్గాలు అందుకునే పన్నీరు సెల్వం మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టారు. గతంలో మాదిరే.. ఈసారీ కూడా.. గంభీర వదనంతో ఆయన తన ప్రమాణస్వీకారోత్సావాన్ని ముగించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినా.. కించిత్ సంతోషం ముఖంలో రాని పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. ఈసారి అంతకు మించిన ఆవేదనతో ఆయన పాలనా పగ్గాలు చేపట్టటంతో జయ వారసుడి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అయితే.. ఇది తాత్కాలికమా? దీర్ఘకాలికమా? అన్న దాని మీద బోలెడు సందేహాలున్నా.. ఇప్పటికైతే ఇంతేనని మాత్రం చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/