Begin typing your search above and press return to search.

శ‌శిక‌ళతో సెల్వం వ‌రుస భేటీల వెనుక లాజిక్ ఏంటి?

By:  Tupaki Desk   |   9 Dec 2016 3:43 PM GMT
శ‌శిక‌ళతో సెల్వం వ‌రుస భేటీల వెనుక లాజిక్ ఏంటి?
X
త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌లుపులు తిరిగే విధంగా క‌నిపిస్తున్నాయి. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా పూర్తిస్థాయి బాధ్య‌త‌లు చేప‌ట్టే ముందు ప‌న్నీర్‌సెల్వం మ‌రోసారి శ‌శిక‌ళ‌ను క‌లిశారు. గురువార‌మే కొంద‌రు సీనియ‌ర్ మంత్రుల‌తో క‌లిసి పోయెస్‌గార్డెన్ వెళ్లిన ఆయ‌న‌.. ఇవాళ ఉద‌య‌మే మ‌రోసారి అక్క‌డికి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. శుక్ర‌వారం కూడా ఆ మంత్రులంద‌రూ ప‌న్నీర్ సెల్వం వెంట ఉన్నారు. ప‌న్నీర్ సీఎం విధులు చేప‌ట్ట‌నున్న క్ర‌మంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ జ‌రుగుతున్న స‌మావేశాలు అనుమానాల‌కు తావిస్తున్నాయి. ఏఐఏడీఎంకే త‌దుప‌రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళే అన్న వాద‌న‌కు వీళ్ల స‌మావేశాలు బ‌లం చేకూరుస్తున్నాయి.

ముఖ్య‌మంత్రిగా ప‌న్నీర్ సెల్వం పూర్తి స్థాయి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న నేప‌థ్యంలో ఈ వ‌రుస‌ భేటీలు జ‌రగడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ స‌మావేశంలో శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ‌న్ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో శ‌శిక‌ళ‌- ప‌న్నీర్ సెల్వం ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు అయిన నేప‌థ్యంలో ఇరువురి స‌మావేశం ఆస‌క్తిక‌రంగా మారింది. ఫిబ్ర‌వ‌రీ 24న జయ‌ల‌లిత జ‌న్మ‌దినం రానున్న నేప‌థ్యంలో ఏ విధంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌నే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా వ‌రుస స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంపై రాజ‌కీయ వ‌ర్గాలు భిన్న చ‌ర్చ‌లు మొద‌లుపెట్టాయి. జ‌య‌ల‌లిత స‌న్నిహితులైన శ‌శిక‌ళ‌, ప‌న్నీర్ సెల్వం ఒక‌రిపై ఒక‌రు ఆదిప‌త్యం చెలాయించేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టార‌ని అంటున్నారు. ఈ ముస‌లం బ‌య‌టప‌డ‌టానికి ముందు సూచ‌న‌లే ఈ వ‌రుస భేటీలు అని అంటున్నారు.