Begin typing your search above and press return to search.

‘అమ్మ’ తన పవర్ ను అలా పంచుతుందట

By:  Tupaki Desk   |   6 Oct 2016 5:05 AM GMT
‘అమ్మ’ తన పవర్ ను అలా పంచుతుందట
X
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రికి చేరిన అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మొన్నటి వరకూ డేంజర్ గా ఉన్న ఆమె ఆరోగ్యం.. లేటెస్ట్ గా అవుటాఫ్ డేంజర్ గా చెబుతున్నారు. అమ్మ ఆసుపత్రిలో చేరి ఇప్పటికి రెండు వారాలైనప్పటికీ.. ఎప్పటికి డిశ్చార్జ్ అవుతారన్న విషయం మీద స్పష్టత లేని పరిస్థితి. ఆమె ఎప్పుడూ ఆసుపత్రి నుంచి బయటకు వస్తారన్నది వైద్యులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారట.

ఏదో వారం.. పది రోజుల వరకూ అమ్మ లేకుండా పాలన మేనేజ్ చేయొచ్చు. కానీ.. ఇలా రోజుల తరబడి అమ్మ ఆసుపత్రిలో ఉంటే పాలన కుంటుబడే పరిస్థితి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా గతంలో మాదిరి పని చేసే పరిస్థితి లేదని.. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వైద్యుల నోట వెంట వచ్చిందని చెబుతున్నారు. ఒత్తిడికి దూరంగా ఉంటూ.. పని భారాన్ని భారీగా తగ్గించుకోవాల్సి ఉందన్నమాట వినిపిస్తోన్న వేళ.. అమ్మ తనకు సాయంగా ఉండేందుకు వీలుగా.. డిప్యూటీ సీఎం పదవిని ఏర్పాటు చేస్తారన్న మాట స్పష్టమవుతోంది.

తన వారసుడిగా కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన బాధ్యతల్ని వీలైనంత ఎక్కువగా పంచుకోవటానికి డిప్యూటీ సీఎం పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పేరుకు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నా.. వ్యవహారాలన్నీ డిప్యూటీ చూసుకునేలా ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాల విషయంలో తప్పించి.. మిగిలిన అంశాలన్నీ డిప్యూటీ చూసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అమ్మ ఆరోగ్యం మరికాస్త మెరుగైన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.

మరి.. అమ్మకు సాయంగా ఉండనున్న డిప్యూటీ పదవి ఎవరికి దక్కే అవకాశం ఉందన్న అంశాన్ని చూస్తే.. జాబితాలో మొదటి పేరుగా పన్నీరు సెల్వం పేరు వినిపిస్తోంది. కేసుల కారణంగా అమ్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రతిసారీ తన స్థానంలో కూర్చోబెట్టె పన్నీరు సెల్వం పేరును పలువురు చెబుతున్నారు. అయితే.. పన్నీరు సెల్వం పేరును వ్యతిరేకిస్తున్న వారు లేకపోలేదు. ఈ మధ్యన ముగిసిన ఎన్నికల సమయంలో ఆయన చేసిన తప్పు అమ్మకు ఆయన మీద గతంలో ఉన్నట్లుగా నమ్మకం లేదని.. ఈసారి డిప్యూటీ స్థానంలో పన్నీరు సెల్వాన్ని ఎంపిక చేయకపోవచ్చని చెబుతున్నారు. మరి.. డిప్యూటీగా అవకాశం దక్కించుకునే వారి జాబితాలోతాజాగా మంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరు కూడా వినిపిస్తోంది. అయితే..ఈ వాదనను కొట్టిపారేసే వారూ లేకపోలేదు. పన్నీరు సెల్వం తప్పు చేసినా.. ఆ విషయాన్ని అమ్మ దగ్గర ఒప్పుకొని ఆమె ఆగ్రహం బారిన పడకుండా తప్పించుకున్నారని.. అందుకు తగ్గట్లే ఆయన్ను ఆర్థిక మంత్రిగా నియమించిన విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. ఈ వాదనలు ఇలా ఉన్నప్పటికీ అమ్మ మనసులో ఎవరున్నారో మరికొద్ది రోజుల్లో తేలిపోతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/