Begin typing your search above and press return to search.

స్పీడు పెంచిన పన్నీర్

By:  Tupaki Desk   |   14 Feb 2017 7:00 AM GMT
స్పీడు పెంచిన పన్నీర్
X
సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం నిమిషం ఆలస్యం చేయకుండా అటాక్ మొదలుపెట్టారు. శశికళను దోషిగా ప్రకటిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నిమిషాల్లోనే 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు శశికళ క్యాంప్ ఉన్న గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టారు. మొత్తం ఆ ప్రాంతాన్నంతటినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. రిసార్టు గేటు తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్లారు.

అయితే.. శశికళను మాత్రం వారేమీ అరెస్టు చేయలేదు. ఆమె తనంతట తానుగా వచ్చి లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. నిజానికి శశికళ లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఉన్నప్పటికీ, మరింత కాలం ఆమె బయటుంటే, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందని, రాష్ట్రంలో నిరసనలు జరగవచ్చని భావిస్తూ, ముందే ఆమెను జైలుకు తరలిస్తే, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థాయికి తేవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి.

కాగా తీర్పు వచ్చిన రెండు నిమిషాల్లోనే అంత భారీ స్థాయిలో పోలీసులు అక్కడకు చుట్టుముట్టడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. ఈ రోజు ఉదయం నుంచే బలగాలను సిద్ధం చేసి రిసార్టు పక్కనే వారిని వెయిట్ చేయించి తీర్పు రాగానే సమాచారం ఇచ్చి పంపించారని తెలుస్తోంది. దీంతో పన్నీర్ ప్రభుత్వ వ్యవస్థను పక్కాగా నడిపిస్తూ మొత్తం తన అదుపులో ఉంచుకుని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రిసార్టును తమ అండర్ లోకి తీసుకున్న పోలీసులు అక్కడున్న ఎమ్మెల్యేలను సిటీలోకి తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/