Begin typing your search above and press return to search.

బ‌హిష్క‌ర‌ణ‌తో ప‌న్నీరుకు క‌న్నీరేనా?

By:  Tupaki Desk   |   12 July 2022 1:30 AM GMT
బ‌హిష్క‌ర‌ణ‌తో ప‌న్నీరుకు క‌న్నీరేనా?
X
తమిళనాడులో ఉత్కంఠ వీడింది. అన్నాడీఎంకే తాత్కాలి ప్రధాన కార్య‌ద‌ర్శిగా మాజీ ముఖ్య‌మంత్రి ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ఎంపిక‌య్యారు. దీంతో గ‌త కొన్ని నెల‌లుగా ఆ పార్టీలో ఏర్ప‌డ్డ సంక్షోభానికి తెర‌ప‌డింది. పార్టీ ప‌గ్గాల‌ను త‌న చేతుల్లోకి తీసుకున్న మ‌రుక్ష‌ణ‌మే ప‌ళ‌నిస్వామి.. మాజీ ముఖ్య‌మంత్రి, ఇప్ప‌టిదాకా పార్టీ కోశాధికారి, పార్టీ క‌న్వీన‌ర్ గా ఉన్న ప‌న్నీరు సెల్వంను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. ఈ మేరకు జూలై 11న‌ జరిగిన సర్వసభ్య సమావేశంలో పళనిస్వామి నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాకుండా ప‌న్నీరు సెల్వంను పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం నుంచి కూడా తొల‌గించారు. ఆయనతో పాటు మద్దతుదారులను కూడా పార్టీ నుంచి తొలగించారు.

త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత ఆక‌స్మికంగా క‌న్నుమూసిన త‌ర్వాత ఆ పార్టీ అనేక సంక్షోభాల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత క‌న్నుమూశాక జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ పార్టీని, ప్ర‌భుత్వాన్ని త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌దామ‌నుకునేలోపే అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీంతో త‌న న‌మ్మిన బంటు ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి (ఈపీఎస్) ని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.

అదే స‌మ‌యంలో జ‌య‌లలిత క‌న్నుమూశాక సీఎంగా తాత్కాలిక బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఒ.ప‌న్నీర్ సెల్వం కూడా పార్టీ, ప్ర‌భుత్వంపై ప‌ట్టుకు ప్ర‌య‌త్నించారు. శ‌శిక‌ళ జైలుకుపోవ‌డంతో పార్టీ, ప్ర‌భుత్వం బాగు కోసం అటు ఈపీఎస్, ఇటు ఓపీఎస్ క‌లిసిపోయారు. ఈపీఎస్ ముఖ్య‌మంత్రిగా, ఓపీఎస్ పార్టీ క‌న్వీన‌ర్, డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇక గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ప‌రాజ‌యం పాలై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే ప్ర‌తిపక్షానికే ప‌రిమిత‌మైంది. దీంతో పార్టీపై పెత్త‌నం కోసం ఈపీఎస్, ఓపీఎస్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు రాజుకుంది. పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం విష‌యంలో రెండు వ‌ర్గాలు కోర్టును ఆశ్ర‌యించాయి.

అయితే అన్నాడీఎంకే పార్టీలో క్రియాశీలకమైన 60 మంది జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది ప‌ళ‌నిస్వామి వెంటే ఉన్నారు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా ఈపీఎస్‌ వెంట వుండడం కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. దీనికి తోడు పన్నీర్‌సెల్వం శశికళతో సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తనను సాగనంపేందుకు కుట్ర జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్‌.. ఏకనాయకత్వం అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ఈ నేపథ్యంలో పళని నేతృత్వంలో సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని పన్నీర్‌ సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు జూలై 11న‌ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన కాసేపటికే.. పళని స్వామి నేతృత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో ఈపీఎస్‌ వర్గం తీసుకొచ్చిన 16 తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు. పళనిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించే తీర్మానాన్ని కూడా ఆమోదించారు.

ఈ సందర్భంగా.. ఓపీఎస్‌, అతడి మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక తీర్మానానికి కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. పన్నీర్‌ సెల్వం.. అధికారిక డీఎంకేకు మద్దతిస్తున్నారని, అధికార పార్టీ నేతలతో సంబంధాలు పెంచుకొని, అన్నాడీఎంకేను బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గానూ.. ఆయనను కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా బహిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.

మ‌రోవైపు దీనిపై ప‌న్నీరు సెల్వం తీవ్రంగా స్పందించారు. తాను 1.5కోట్ల మంది పార్టీ కార్యకర్తల చేత అన్నాడీఎంకే కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యాయని తెలిపారు. తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు పళనిస్వామికి లేదన్నారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొన్నందుకు గానూ.. ఈపీఎస్‌నే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తాను కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.