Begin typing your search above and press return to search.

పంత్ కు ఇన్ఫెక్షన్ భయం.. ప్రేవేటు వార్డుకు తరలింపు

By:  Tupaki Desk   |   2 Jan 2023 9:02 AM GMT
పంత్ కు ఇన్ఫెక్షన్ భయం.. ప్రేవేటు వార్డుకు తరలింపు
X
ఆస్పత్రుల్లో చికిత్స పొందడం ఒక ఎత్తయితే.. ఆ క్రమంలో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాల్సి రావడం మరో ఎత్తు. దీర్ఘకాలిక రోగులై ఉండి.. కీలకమైన శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే ఇన్ఫెక్షన్ల ముప్పు మరీ ఎక్కువ.

రోగులు పెద్ధ ఎత్తున రావడం, పారిశుధ్యం కొరవడడం, వసతులు తక్కువగా ఉండడం, పరికరాలు అందరికీ ఉపయోగించడం తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇన్ఫెక్షన్ కు కారణాలుగా చెప్పొచ్చు. అందుకే కాస్త డబ్బున్నవారంతా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులనే ప్రిఫర్ చేస్తుంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. అసలే కొవిడ్ వ్యాప్తి ఉండడంలో ఉండడం, చలికాలం కావడంతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

ప్రేవేటు స్యూట్ కు మార్పు రిషభ్ పంత్ గాయపడిన వెంటనే రూర్కీలో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసి డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, అక్కడ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండడంతో ప్రైవేటు స్యూట్ కు మార్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)వెల్లడించింది.

పంత్ కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వర్గాలకు తామే ఈ మేరకు సూచన చేసినట్లు తెలిపింది. పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించింది. పంత్ ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆదివారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, పంత్ నుదురుపై రెండు చోట్ల చర్మం కట్ అయింది.

కుడిమోకాలు లిగమెంట్ చీలింది. కుడి మోచేయి, పాదం, వీపుభాగంలో దెబ్బలు తగిలాయి. ఆస్ప్రతికి అభిమానులు, ప్రజలు టీమిండియా క్రికెటర్ కావడం.. అందులోనూ సొంత రాష్ట్రం వాడు కావడంతో పంత్ ను చూసేందుకు డెహ్రాడూన్ ఆస్పత్రికి పెద్దఎత్తున అభిమానులు, ప్రజలు వస్తున్నారు.

దీనిపైనా ఢిల్లీ క్రికెట్ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పంత్ ను చూసేందుకు ఎవరూ రావొద్దని.. ఎక్కువమంది రావడం ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణం అవుతుందని పేర్కొంటోంది. మరోవైపు పంత్ ను పరామర్శించేందుకు బాలీవుడ్ ప్రముఖులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితరులు రావడం గమనార్హం. కాగా, పంత్ ను శనివారం డీడీసీఏ కార్యదర్శి శ్యాం సుందర్ పరామర్శించారు. బీసీసీఐ వైద్యుల టీమ్ పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఫాలో అప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.