Begin typing your search above and press return to search.

కాశ్శీరీలకు సరికొత్త సందేశం ఇవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:37 AM GMT
కాశ్శీరీలకు సరికొత్త సందేశం ఇవ్వాల్సిందే
X
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వారంతా కాశ్శీర్ మాట ఎత్తగానే పులకించిపోతారు. కాశ్శీర్ తమ దేశంలో భాగమంటూ.. దానిపై వాటా కోసం అంతర్జాతీయ సమాజంలో పాక్ గొంతు విప్పితే.. సగటు భారతీయుడి గుండె మండిపోతుంది. ఇక.. బీజేపీ సానుభూతిపరులైతే.. ‘‘భరతమాత నుదుటి కుంకపు బొట్టు కాశ్శీరం’’ అంటూ భావోద్వేగంతో నినాదం చేస్తాడు.

ఎక్కడో.. అల్లంత దూరాన ఉండే కాశ్శీరంపై సగటు భారతీయుడికి భావోద్వేగం కాస్తంత ఎక్కువే. కానీ.. దశాబ్దాల తరబడి కాశ్శీర్ విషయంలో కేంద్రంలో ఏర్పడిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమా అని.. కాశ్శీరీలకు.. మిగిలిన దేశవాసులకు మధ్య దూరం పెరిగింది. జమ్మూకాశ్శీర్ లోని ఏ ప్రాంతానికైనా మీరెళ్లి.. అక్కడి ప్రజలతో మాట్లాడితే.. ఆశ్చర్యకరమైన మాటలు వారి నోటి వెంట వినిపిస్తాయి. మరీ.. ముఖ్యంగా కాశ్శీర్ లోయలో అయితే.. భారత్ వేరు.. తాము వేరు అన్నట్లుగా స్కూలుకు వెళ్లే పిల్లల నోటి నుంచి వస్తాయి. ఇక.. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరైతే.. మీ భారతీయులు మా మీద ఏదో ప్రేమ ఉన్నట్లు మాటలు చెబుతారు..కానీ.. మా గురించి నిజంగా పట్టించుకున్నారా? అన్న మాట వినిపిస్తుంది.

అలాంటి కాశ్శీరానికి.. అక్కడున్న ప్రజలకు సరికొత్త సందేశాన్ని పంపాల్సిన చక్కటి అవకాశం వచ్చేసింది. సరిహద్దులు దాటి కాశ్శీరంలో అడుగుపెట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించే ముష్కరులను ప్రాణాలకు తెగించి పట్టుకున్న కాశ్శీరీలైన రాకేష్ కుమార్ శర్మ.. బిక్రమ్ జీత్ లకు శౌర్య చక్ర పురస్కారం ఇవ్వాలంటూ జమ్మూ కాశ్శీర్ పోలీసులు కేంద్రానికి ప్రతిపాదించారు.

ఇప్పటికే ఈ ఇద్దరికి జమ్మూకాశ్శీర్ పోలీసు శాఖలో ఉద్యోగాలు ఓకే చేస్తూ ఆర్డర్లు ఇవ్వటం తెలిసిందే. పాక్ నుంచి దేశంలోకి వచ్చిన ఉగ్రవాది నవేద్ ను సజీవంగా పట్టుకోవటంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరిద్దరిని దేశం యావత్తు కొనియాడిన సంగతి తెలిసిందే.

తాజాగా రాకేష్ కుమార్ శర్మకు ఆపరేషనల్ గ్రౌండ్ కానిస్టేబుల్ గా.. బిక్రమ్ జీత్ ను ఫాలోవర్ గా నియమిస్తూ ఆర్డర్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీరికి శౌర్యచక్ర పురస్కారం అందించాలంటూ కాశ్శీర్ పోలీసులు ప్రతిపాదించారు. ఇలాంటి సమయాల్లో కేంద్రం సానుకూలంగా స్పందించి.. కాశ్శీర్ సమాజానికి ఒక చక్కటి సందేశం పంపాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి కాశ్శీర్ కు మధ్య దూరం తగ్గించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్న విషయం మర్చిపోకూడదు.