Begin typing your search above and press return to search.

గల్లీ హోటల్ల మాదిరే ప్యారడైజ్ ఈ పాడురోగమేంది?

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:49 AM GMT
గల్లీ హోటల్ల మాదిరే ప్యారడైజ్ ఈ పాడురోగమేంది?
X
బిర్యానీ అన్నంతనే ప్యారడైజ్ బిర్యానీ గుర్తుకు వస్తుంది. హైదరాబాదీ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా ఇమేజ్ వచ్చిందంటే అందులో ప్యారడైజ్ పుణ్యం చాలానే ఉంది. గతంలో సికింద్రాబాద్ కు మాత్రమే పరిమితమైన ప్యారడైజ్ హోటల్.. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ మహానగరంలోని నలుమూలల తమ శాఖల్ని విస్తరిస్తూ దూసుకెళుతుంది. ప్యారడైజ్ హోటల్ కు ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు.

అలాంటి హోటల్లో సాధారణంగా శుచికి.. శుభ్రతకు.. ఆహారపదార్థాల తయారీ విషయంలో జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటారని భావిస్తాం. అయితే.. అలాంటి ఆశలు పెట్టుకోవద్దన్న చందంగా కొత్త విషయం తెర మీదకు వచ్చింది. తాజాగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ ను తనిఖీలు నిర్వహించిన జీహెచ్ఎంసీ అధికారులు హోటల్ లోపల శుభ్రత పాటించని నేపథ్యంలో హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వటమే కాదు.. రూ.లక్ష జరిమానాను విధించారు.

ఇటీవల హోటల్ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తికి.. అందులో తల వెంట్రుకలు వచ్చాయి. దీంతో హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ విషయాన్ని అక్కడి సిబ్బంది లైట్ తీసుకొని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఒళ్లు మండిన సదరు కస్టమర్.. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పుడ్ ఇన్ స్పెక్టర్.. శానిటరీ ఇన్ స్పెక్టర్ తనిఖీలు నిర్వహిచారు. హోటల్ లో పరిశుభ్రత పాటించకపోవటంతో వారికి ఫైన్ విధించారు. మాంచి పేరున్న హోటల్ కిచెన్ ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏమిటని అధికారులు ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది. పేరుకు పెద్ద హోటలే కానీ.. నిర్వహణ మరీ ఇలా ఉండటం ఏమిటన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వారం వ్యవధిలో పరిశుభ్రత విషయంలో లోపాల్ని సరి చేసుకోవాలని.. లేనిపక్షంలో హోటల్ ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గల్లీ హోటల్లో పరిశుభ్రత లేదంటే సర్దిచెప్పుకోవచ్చు. కానీ.. వరల్డ్స్ ఫేమస్ బిర్యానీ తమ సొంతంగా చెప్పుకునే ప్యారడైజ్ లాంటి సంస్థ సైతం నీట్ నెట్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏమనాలి?