Begin typing your search above and press return to search.

మ‌హిళా మంత్రి భ‌ర్త‌తో బాబు కొత్త రాజ‌కీయం

By:  Tupaki Desk   |   29 May 2018 6:59 AM GMT
మ‌హిళా మంత్రి భ‌ర్త‌తో బాబు కొత్త రాజ‌కీయం
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌మైన రాజ‌కీయం గురించి కొత్త చ‌ర్చ మొద‌లైంది. 2014 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొన‌సాగించి ఇటీవ‌లే ఆ బంధానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు బైబై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. త‌న పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రుల‌తో సైతం ఆయ‌న రాజీనామా చేయించారు. పొత్తు విక‌టించిన అనంత‌రం బీజేపీపై బాబు భ‌గ్గుమంటున్నారు. అదే స‌మ‌యంలో రాబోయే కాలంలో ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌బోయేది తానేన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. బాబు చేస్తున్న ఈ ప్ర‌క‌ట‌న‌లతో పాటు మ‌రో అంశాన్ని విశ్లేష‌కులు గ‌మ‌నిస్తున్నారు. అదే ఏపీ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ ను ఆ ప‌దవిలో కొన‌సాగించ‌డం. తాజాగా మ‌హానాడులో ఆయ‌న సూచ‌న‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ త‌న ప్ర‌సంగాన్ని సాగించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందంటున్నారు.

ప‌ర‌కాల స‌తీమ‌ణి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్రంలో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ మంత్రి హోదాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోడీ టీంలోని ముఖ్యుల్లో ఆమె ఒక‌రు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల మధ్య ప్ర‌ధాని మోడీ- ఏపీ సీఎం చంద్ర‌బాబు బద్ధ శత్రువులయ్యారు. బాబుపై మోడీ తరపున అమిత్‌ షా రోజుకో నింద వేస్తుంటే - ఇక బాబు అయితే నిత్యం మోడీ - అమిత్‌ షా పై పరుష పదజాలంతో కత్తులు దూస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే...బీజేపీ - టీడీపీల మ‌ధ్య నిజంగానే వైరం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే మ‌హానాడులో మాత్రం ఇందుకు భిన్న‌మైన సీన్ క‌నిపించింది. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో సోమవారం ఉదయం చంద్రబాబు ఆగ్రహంగా కేంద్రంపై - బీజేపీ అధినేత అమిత్‌ షాపై నిప్పులు చెరుగుతుంటే పక్కనే ఉన్న పరకాల ప్రభాకర్ క్షణక్షణం కీలకమైన సమాచారంతో చీటీలు అందిస్తుండ‌గా...బాబు వాటిని త‌న ప్ర‌సంగంలో భాగం చేశారు. ఇంతేకాకుండా రహస్యంగా బాబు చెవి దగ్గ‌ర ప‌ర‌కాల కొన్ని విష‌యాల‌ను కూడా పంచుకున్నారు. ఈ ప‌రిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాబుకు బీజేపీపై ఇంకా ప్రేమ త‌గ్గ‌లేద‌ని ఇందుకు ప‌ర‌కాలను స‌ల‌హాదారుగా కొన‌సాగించ‌డ‌మే కాకుండా మ‌రో ఉదాహ‌ర‌ణ కూడా ఉందంటున్నారు. మహారాష్ట్రకు చెందిన మంత్రి స‌తీమ‌ణిని టీటీడీ పాలకవర్గంలో సభ్యుడిగా నియమించడం, బీజేపీతో సంబంధాలు బెడిసికొట్టిన త‌ర్వాత కూడా ఆమెను కొన‌సాగించ‌డం బాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమంటున్నారు. చంద్ర‌బాబుకు బీజేపీతో పెట్టుకోవ‌డం ఇష్టం లేద‌ని, ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేకత టీడీపీపై మ‌ర‌ల‌కుండా చూసుకోవాల‌న్న‌దే ఆయ‌న ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని అంటున్నారు.