Begin typing your search above and press return to search.

పార్టీలో లేకున్నా పరకాల తీర్మానాలు

By:  Tupaki Desk   |   29 May 2017 6:47 AM GMT
పార్టీలో లేకున్నా పరకాల తీర్మానాలు
X
టీడీపీ మహానాడులో ప్రవేశపెట్టిన ఓ రాజకీయ తీర్మానం కాస్త కలకలం రేపింది. సాధారణంగా పార్టీ సభ్యులే తీర్మానాలు చేస్తారు. కానీ... పార్టీలో సభ్యత్వం లేదని అంటున్న ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఓ తీర్మానం ప్రవేశపెట్టడం ఆసక్తి రేపింది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ ఆయన మహానాడులో తీర్మానించారు. పరకాల ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ మంత్రి కళావెంకటరావు బలపరిచారు.

పార్టీ సభ్యుడు కాని వ్యక్తి తీర్మానం ఎలా పెడతారన్న ప్రశ్న ఉత్పన్నం కాగా.. దానిపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. పరకాల ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తప్పేమీ కాదని, ఆయన ప్రభుత్వ సలహాదారు అని, అతని పదవీ నియామకం రాజకీయంగా జరిగిందని వివరించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న స్ఫూర్తితో పని చేసి, పార్టీ స్థాపించి పేదవాళ్ల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన నందమూరి తారకరామారావుకు భారత రత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేయడంలో తప్పు లేదన్నారు. దేశం కోసం ఆయన ఎవర్నీ లెక్క చేయకుండా పోరాడారని అన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ అడ్డగోలుగా, అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేస్తే నభూతో న భవిష్యత్ అన్న తీరులో పోరాడి నెల రోజుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఏకైక సీఎం ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు.

అయితే, ప్రతీ మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నా అందుకు తగిన ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబుకు అసలు ఇది ఇష్టం లేదనే వారు కూడా ఉన్నారు. అందుకు కారణం కూడా చెప్తుంటారు. ఒకవేళ ఎన్టీఆర్ కు భారత రత్న వస్తే దాన్ని ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తప్ప ఇంకెవరూ అందుకునే అవకాశమే లేదు. అది ఇష్టం లేకే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఏమాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వంలో రావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/