Begin typing your search above and press return to search.

పరకాల మళ్లీ ఫాంలోకి వచ్చారా?

By:  Tupaki Desk   |   12 July 2016 6:54 AM GMT
పరకాల మళ్లీ ఫాంలోకి వచ్చారా?
X
ఏపి ప్రభుత్వ మీడియా (కమ్యూనికేషన్) సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఆ తరువాత ప్రయారిటీ కోల్పోయి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే... తాజాగా ఆయనకు మళ్లీ ప్రయారిటీ పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు మళ్లీ రెండేళ్ల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడమే దీనికి నిదర్శనం. సహజంగా ఈ పదవిని ఏడాదిపాటు మాత్రమే పొడిగించే సంప్రదాయం ఉంది. అందుకు భిన్నంగా రెండేళ్లు పొడిగించడాన్నిబట్టి, ఆయనకు తిరిగి ప్రాధాన్యం ఏర్పడిందన్న సంకేతాలు వెలువడ్డాయి.

ఓటుకు నోటు కేసుకు ముందు పరకాలకు ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఉండేది. మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు పక్కనే కూర్చునేవారు. బాబు బిజీగా ఉన్న సమయంలో కొన్ని కీలక శాఖల సమీక్షలు - బాబు తన వద్దకు వచ్చిన ముఖ్య వ్యక్తులను పరకాల వద్దకు పంపి - ప్రాజెక్టు రిపోర్టులపై చర్చించమని పురమాయించేవారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు - వాటికి సంబంధించిన కీలక సమావేశాలు కూడా పరకాల ఆధ్వర్యాన నడిచాయి. ఒకరకంగా పరకాల చాంబర్ బ్యాక్ ఆఫీసుగా ఉండేది. ఒకదశలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి - మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కాగా, తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో.. బాబు తరఫున పరకాల సమర్థవంతంగానే వాదించినప్పటికీ.. బాబు కోటరీ ప్రముఖులు - పరకాల వల్లనే కథ అడ్డం తిరిగిందని చెప్పడంతో అప్పటినుంచి ఆయన ప్రాధాన్యం తగ్గింది. ఫలితంగా మునుపటి మాదిరిగా మంత్రివర్గ సమావేశాల్లో సీఎం పక్కన కనిపించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూరింది.

అయితే - జాతీయ వ్యవహారాలు - జాతీయ మీడియాతో మాట్లాడేందుకు సమర్ధులైన మంత్రులు లేకపోవడం, గత కొద్దికాలం క్రితం ఆంగ్ల చానెల్‌ లో పార్టీ ఎంపి ఒకరు మాట్లాడిన భాష సరిగా లేకపోవడంతో అది అభాసుపాలయింది. ప్రస్తుతం మంత్రివర్గంలో యనమల రామకృష్ణుడు వంటి ఒకరిద్దరికి మాత్రమే ఆంగ్లంపై పట్టు ఉంది. కానీ ఆయన తన పరిధిని మించి ఎప్పుడూ ముందుకు వెళ్లరు. ఎంపీల్లో కూడా ఆంగ్లంపై పట్టున్న వారి సంఖ్య తక్కువ. విదేశాల నుంచి ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో వారితో సంభాషించే స్థాయి మంత్రులు కూడా లేకుండా పోయారు. ఇదే పరకాలకు మళ్లీ ప్లస్ పాయింట్ అయినట్లు కనిపిస్తోంది. ఆంగ్లం - హిందీ - తెలుగుపై మంచి పట్టుతోపాటు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను - ఆంగ్లంలో సూటిగా స్పష్టం చేసే ఆయన భాషాప్రావీణ్యం - రాష్ట్ర-జాతీయ మీడియాపై నిరంతర విశ్లేషణ కోసం చేసే కసరత్తు బాబును మెప్పించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వంపై కాపీ రైట్ యాక్టు కింద సైబర్ కేసు నమోదు చేసిన సందర్భంలో, పరకాల వాదన కూడా ముఖ్యమంత్రిని మెప్పించిందంటున్నారు. కాగా, పరకాల ప్రాధాన్యం తగ్గిపోయిందని, ఆయనను పక్కకుపెట్టారని ప్రభుత్వంలో ఒక వర్గం ప్రచారం చేసిన నేపథ్యంలో, ఆయన పదవీకాల పొడిగింపుపై సందేహాలు తలెత్తాయి. అయితే ఏకంగా రెండేళ్లు పొడిగింపు ఇవ్వడంతో, పరకాల మళ్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టుబిగించారని స్పష్టమవుతోంది.