Begin typing your search above and press return to search.

ఐవైఆర్ మాట‌ను ప‌ర‌కాల అబద్ధంగా చెబుతున్నారే!

By:  Tupaki Desk   |   21 Jun 2017 4:17 AM GMT
ఐవైఆర్ మాట‌ను ప‌ర‌కాల అబద్ధంగా చెబుతున్నారే!
X
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావుకు చెందిన విష‌యమే హాట్ టాపిక్‌ లా మారింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేయ‌డ‌మే కాకుండా... ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వెంట‌నే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గానూ ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు భుజానికెత్తుకున్నారు. అధికారంలో ఉన్న‌ది టీడీపీ ప్ర‌భుత్వం కాబ‌ట్టి... ప్ర‌భుత్వం నియ‌మించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తులు టీడీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌కూడ‌ద‌న్న‌ది చంద్ర‌బాబు స‌ర్కారు వాద‌న‌. అయితే ప్ర‌భుత్వం త‌ప్పు చేస్తున్నా... నోరు మెద‌ప‌కుండా ఎలా ఉంటామ‌న్న‌ది ఐవైఆర్ వాద‌న.

ఏది ఏమైనా ప్ర‌భుత్వ నామినేటెడ్ ప‌ద‌విలో ఉండి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పైనా, నేరుగా సీఎంపైనా వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డం కాస్తంత ఇబ్బందిక‌ర విష‌య‌మే. ఈ కార‌ణంగానే ఐవైఆర్‌ ను ఉన్న‌ప‌ళంగా టీడీపీ ప్ర‌భుత్వం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పించింద‌న్న విష‌యం అర్థం కాని విష‌య‌మేమీ కాదు. ఐవైఆర్‌ ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌లువురు నేత‌లు మీడియా ముందుకు వ‌చ్చి చాంతాడంత వివ‌ర‌ణ ఇచ్చారు. అదే స‌మ‌యంలో త‌న త‌ప్పేమీ లేకున్నా కూడా టీడీపీ ప్ర‌భుత్వం త‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించింద‌ని, స‌ద‌రు ప‌ద‌వి నుంచి త‌ప్పుకోమ‌ని త‌న‌కు ఆదేశాలు జారీ చేసినా... తానే స్వ‌యంగా త‌ప్పుకునే వాడిన‌ని ఐవైఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో త‌న త‌ప్పేమీ లేద‌ని, మొత్తం త‌ప్పంతా తెలుగు దేశం పార్టీ - ఆ పార్టీ ప్ర‌భుత్వానిదేన‌ని కూడా ఐవైఆర్ కాస్తంత గ‌ట్టిగానే చెప్పారు. కొన్ని ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు అసంబ‌ద్ధంగా ఉన్నాయ‌న్న విష‌యాన్ని తాను సీఎం చంద్ర‌బాబుకు చెప్పేందుకు చాలా య‌త్నించాన‌ని, ప‌లుమార్లు సీఎం అపాయింట్‌ మెంట్ కోరాన‌ని, అయితే ఆరు నెల‌లుగా త‌న‌కు సీఎం ద‌ర్శ‌న భాగ్య‌మే క‌ల‌గ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ సీఎం అపాయింట్‌ మెంట్ దొరికి ఉంటే... అన్ని విష‌యాల‌ను చంద్ర‌బాబుకే నేరుగా చెప్పేవాడిన‌ని కూడా ఐవైఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఐవైఆర్ మీడియా స‌మావేశం ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే... ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మీడియా ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

ఐవైఆర్‌కు సీఎం అపాయింట్‌ మెంట్ ఇవ్వ‌లేద‌న్న విష‌య‌మే శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని ఆయ‌న తేల్చేశారు. నెల క్రిత‌మే ఐవైఆర్ సీఎంతో మాట్లాడార‌ని కూడా ప‌ర‌కాల చెప్పారు. ఓ వైపు ఆరు నెల‌ల నుంచి సీఎం ద‌ర్శ‌న భాగ్య‌మే క‌ల‌గ‌లేద‌ని ఐవైఆర్ మొత్తుకుంటూ ఉంటే... నెల క్రిత‌మే సీఎంతో ఐవైఆర్ భేటీ అయ్యార‌ని ప‌ర‌కాల ఎలా చెప్పారో అర్థం కాని ప‌రిస్థితి. సాక్షాత్తు సీఎం అపాయింట్‌ మెంట్ కోరిన వ్యక్తే త‌న‌కు సీఎం నుంచి పిలుపే రాలేద‌ని చెబుతుంటే... కాదు సీఎంతో నెల క్రిత‌మే ఐవైఆర్ భేటీ అయ్యార‌ని చెప్పిన ప‌ర‌కాల కొత్త మెలిక పెట్టేశారు. మ‌రి ఈ విష‌యంలో ఐవైఆర్ వాద‌న క‌రెక్టో, లేదంటే ప‌ర‌కాల వాద‌న క‌రెక్టో తేల్చాల్సిన బాధ్య‌త మాత్రం సీఎం కార్యాల‌యంపైనే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/