Begin typing your search above and press return to search.

భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు ఏపీలో ఎంతో ప్రాధాన్యం

By:  Tupaki Desk   |   18 May 2017 10:19 AM GMT
భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు ఏపీలో ఎంతో ప్రాధాన్యం
X
భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వయంగా అనేక వేదికలపై చెప్పారని, అదే రీతిలో ప్ర‌భుత్వం ముందుకు సాగుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన ప‌ర‌కాల సోషల్ మీడియా పోస్టింగులపై ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివ‌రించారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంద‌ని అయితే సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన స్థాయిలో చిత్రాలు, భాషతో సోషల్ మీడియా పేరుతో వాడుకోవడం సబబేనా? అని పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. జస్టిస్ కట్టూ సోషల్ మీడియా అరెస్టులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామ‌ని తెలిపారు. కట్జూ ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్య రాతలు రాస్తే అంగీకరిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛగా భావించి ఊరుకుంటారా అని ప‌ర‌కాల ప్ర‌శ్నించారు.

కార్టూన్ అంటే వ్యంగ్యంగా చెప్పడం, అసభ్యంగా చిత్రీకరించడం కాదని ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మీద కూడా కార్టూన్లు వేస్తే ఆయనే నవ్వుకునేవారని గుర్తు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇది అని గుర్తు చేశారు. మిగిలిన అన్ని జాఢ్యాల వలే దీన్ని కూడా పౌర సమాజం ఆలోచించాలని, ఇందులో వున్న అనౌచిత్యాన్ని పౌరులు ప్రశ్నించిననాడే మళ్లీ ఇలాంటి వారు అసభ్యమైన కార్టూన్లు పెట్టడానికి సాహసించరని తెలిపారు. ``ఎంపీ కొత్తపల్లి గీత మీద ఇదే ఇంటూరి రవికిరణ్ అసభ్య రాతలు - చిత్రాలు రాస్తే వైసీపీ కార్యకర్తలు కేసు పెట్టారు. వైఎస్ ఆర్సీపీ కార్యకర్తలు ఇంటూరి రవికిరణ్ మీద 31 జులై 2014లో జీకే వీధి పోలీస్ స్టేషన్ విశాఖ రూరల్‌ లో పోలీస్ కంప్లయింట్ చేసిన మాట వాస్తవం కాదా?` అని ప్ర‌శ్నిస్తూ రవికిరణ్ మీద 2014లో వైసీపీ కార్యకర్తలు నమోదు చేసిన కేసు వివరాలను పరకాల ప్రభాకర్ వెళ్ల‌డించారు. వైసీపీ వారు ఆనాడు రవికిరణ్ మీద పెట్టిన కేసు భావ ప్రకటన స్వేచ్ఛ కాదా అని డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య రాతలను ఎంతవరకు అమోదించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. ``బికినీల్లో చూపించడం, పలకలేని విధంగా మాట్లాడటం తగునా? డ్రయివర్లతో అక్కచెల్లెళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఏవిధమైన భావ ప్రకటన స్వేచ్ఛ అని మీరు అనుకుంటున్నారు?ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే ఇద్దరిని ఇంతవరకు పోలీసులు అరెస్టులు చేశారు. అస‌భ్య‌క‌ర‌మైన పోస్టింగ్‌ ల విష‌యంలో అంద‌రు జాగ్ర‌త్త‌గా ఉండాలి`` అని స్ప‌ష్టం చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/